ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల వివాదానికి ఇంకా శుభం కార్డు పడలేదు. ఫిబ్రవరి 24 న సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ.. ప్రభుత్వం నుంచి జీఓ రావాల్సి ఉండగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో వాయిదా పడింది. ఈ లోపు ఫిబ్రవరి 25న పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలయ్యింది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక కలెక్షన్ల పరంగా తెలంగాణ సహా ఓవర్‌సీస్ మార్కెట్‌లో దూసుకుపోతున్నప్పటికి ఆంధ్ర ఏరియాలో మాత్రం చెప్పుకోదగిన కలెక్షన్స్ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం టికెట్ల రేట్ల తగ్గింపు. తాజాగా ఈ విషయమై మరోసారి మెగాబ్రదర్ నాగబాబు మండి పడ్డారు. ‘భీమ్లా నాయక్’పై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తప్పుపడుతూ ఓ వీడియో ద్వారా నిప్పులు చెరిగారు. కొడాలి నానిని హీరోగా పెట్టి సినిమా తీయండి అంటూ సెటైర్స్ వేశారు.
వైసీపీ ప్రభుత్వానికి, మంత్రులకు సినిమా వాళ్ళ పని గురించి తెలియదని.. సామాన్యుడికి టిక్కెట్ ధర అందుబాటులో ఉండాలనే విషయంలో తాను కూడా ఏకీభవిస్తున్నానని అన్నారు. టోటల్ సినిమా బడ్జెట్‌లో హీరోల రెమ్యునరేషన్‌లు 10 లేదా 12 పర్సెంట్ ఉంటుంది. అజ్ఞానపు మాటలు మాట్లాడే వాళ్లకు సినిమా మేకింగ్ గురించి ఏం అర్థమవుతుందంటూ ఫైర్ అయ్యారు నాగబాబు.
ఇది కూడా చదవండి : పవన్ విషయంలో మారిన కొడాలి నాని స్వరం! ఏకంగా సలహాలు!
సినిమాకు నష్టం వాటిల్లితే చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, వరుణ్ తేజ్ వీళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించడమో వెనక్కి ఇవ్వడమో జరిగిందని తెలిపారు. కానీ వాళ్లంతా ఈ విషయం గురించి మెడలో బోర్డులు వేసుకొని తిరగరన్నారు. ఏ హిరో అయినా సినిమా బాగా బిజినెస్ అయితేనే రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒక సినిమా ప్లాప్ అయితే హీరోకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. హీరో ఒక సినిమాకీ హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటే, ఆ సినిమా ప్లాప్ అయితే తరువాత చేసే దానికి 50 శాతం రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు. కేవలం డిమాండ్‌ను బట్టే వ్యాపారం అని చెప్పుకొచ్చారు నాగబాబు.
పవన్ కల్యాణ్‌ని అణగ దొక్కేయాలన్నదే సీఎం జగన్ పర్సనల్ ఎజెండా అని.. మీకు పడని వర్గం వాళ్ల హీరోల ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలనే ఇలా చేస్తున్నారని నాగబాబు మండి పడ్డారు. అందుకు సినిమా ఇండస్ట్రీ మీద పడ్డారని ఆరోపించారు. ఆంధ్రలో ఎవ్వరూ ఏ వ్యాపారం చేసుకున్నా కూడా దాన్ని సీఎం జగనే తీసేసుకుంటున్నారని విమర్శించారు. అలాంటప్పుడు మీరే వెల్లంపల్లి శ్రీను, కొడాలి నాని లాంటి వాళ్ళను హీరోలుగా పెట్టి సినిమాలు తీయండి. దాని వల్ల ఆంధ్రలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. మీ ఎమ్మెల్యేలు, ఎంపీల నటన ముందు మేం చాలా చిన్నవాళ్లం అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు సినిమాని ఆంధ్రలో బ్యాన్ చెయ్యండి. మాకు నష్టం లేదు. టెక్నాలజీ డెవలప్ అయ్యింది కాబట్టి యూట్యూబ్ లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో విడుదల చేసుకున్నా డబ్బలు వస్తాయని తెలిపారు.
ఇది కూడా చదవండి : ‘భీమ్లా’ నాయక్ పై నారా వారి ట్వీట్స్ కు కారణం?
చిరంజీవిగారు కొంతమంది హీరోలతో వెళ్లి జగన్ గారితో మాట్లాడారు. మరి జీవో ఇవ్వడానికి ఇంత ఆలస్యం ఎందుకు.. జీవో ఇవ్వకుండా పాత దాన్నే కంటిన్యూ చేయడం వల్ల.. అయ్యా అంటూ పవన్ కల్యాణ్, మేమందరం వస్తామనుకున్నారా.. అది జరగని పని అంటూ తనదైన కోణంలో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు నాగబాబు. వైసీపీ ప్రభుత్వం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఇప్పటిదాకా ఒరిగిందేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.