ఐపీఎల్.. క్రికెట్ అభిమానులకు మంచి వినోదం అందించే టోర్నీ. ఫైనల్‌గా ఏ జట్టు నెగ్గిన క్రికెట్ ఫ్యాన్స్ టోర్నీ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ విషయం ఆటగాళ్లుకూ తెలుసు. ఇక ఐపీఎల్ ట్రోఫీని అత్యధికంగా 5 సార్లు నెగ్గిన ముంబై జట్టుకు, కెప్టెన్ రోహిత్ శర్మకు అది సాధారణ విషయం. కానీ ఈ ఐపీఎల్ తర్వాత వచ్చే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అలా కాదు. అది దేశాల మధ్య జరిగే క్రికెట్ సంగ్రామం. దేశ ప్రజల భావోద్వేగంతో ముడిపడి ఉంటుంది. అలాంటి ట్రోఫీని గెలిస్తే ఆ కిక్కే వేరు. ఎప్పుడో 2007లో జరిగన మొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ మళ్లీ దాన్ని సొంతం చేసుకోలేదు. కానీ ఈ సారి మాత్రం ఎట్టిపరిస్థితిల్లో పొట్టి ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించాలనే కసితో ఉన్నారు టీమిండియా ఆటగాళ్లు. ఒక పక్క ఐపీఎల్‌లో పోటాపోటిగా తలపడుతున్న టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం తమ కన్ను ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌పై పెట్టారు.
ఇషాన్‌తో ఓపెనింగ్ చేయించింది వరల్డ్ కప్ కోసమే…
అందుకోసమే.. వరల్డ్ కప్ జట్టులో కీలక సభ్యుడైన ఇషాన్ కిషన్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే అతనిపై ఒత్తిడి తగ్గించి, ఆత్మవిశ్వాసం పెంచేందుకు అతనికి బాగా అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ ట్రోఫీ కంటే కూడా ఇషాన్ ఫామ్‌లోకి రావడం తనకు ముఖ్యం అన్నట్లు రోహిత్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రోహిత్ నిర్ణయం తప్పు కాదని నిరూపిస్తూ ఇషాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కేవలం 25 బంతుల్లో 50 పరుగులు చేసి రాజస్తాన్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని వేగంగా ఫినిష్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. రోహిత్ శర్మ ప్లాన్ కూడా వర్క్‌అవుట్ అయింది. మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ కంటే ముందు ఇషాన్ 8 మ్యాచ్‌లలో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.
ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి వచ్చేలా చేసిన విరాట్..
అంతకు ముందు గత నెల 26వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇషాన్ కిషన్ విఫలం అయ్యాడు. 12 బంతులు ఆడి కేవలం 9 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. మ్యాచ్ అనంతరం ఇషాన్‌తో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఒక వైపు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఆర్సీబీ జట్టు నడిపిస్తూనే.. రాబోయే వరల్డ్ కప్‌లో తన జట్టు సభ్యులు ఎలా ఆడుతున్నారో అని టీమిండియా సారథిగా కూడా విరాట్ పరిశీలిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఇషాన్ కిషన్‌తో మాట్లాడి అతనిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాడు. అతను చేస్తున్న తప్పులను వివరించి బాగా ఆడేలా ధైర్యం ఇచ్చాడు. ఇలా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమకు ఐపీఎల్ కంటే కూడా దేశానికి వరల్డ్ అందించడమే ముఖ్యం అని చెప్పకనే చెప్తున్నట్లు క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైన ఒక యువ క్రికెటర్‌కు ఇద్దరు దిగ్గజాలు అండగా నిలబడి, అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు తోడ్పడటం అనేది ఇండియన్ క్రికెట్‌కు కచ్చితంగా మంచి చేసే అంశమే. మరీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చేసిన ఐపీఎల్ కంటే కూడా టీమిండియాకు వరల్డ్ కప్ అందించడంపై ఎక్కువ ఫోకస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోనిని కవ్వించిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ అయిపోయాక ధోని ఏమి చేశాడంటే?