గేదెల గుంపు దాడిలో గాయపడిన పులి… కలికాలం!..

గేదె తనని ఏం చేస్తుందీ అని ఫీలయ్యింది ఓ పులి. తనలాంటి కౄరమృగం సాధుజంతువులని చంపడం ఎంతసేపూ అనుకుంది… ఉరికింది… కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా సీన్ రివర్స్ అయ్యింది. గేదెల మంద ముందు పులి బలాదూర్ అయ్యింది. ఓ గేదెల గుంపుపై దాడి చేసేందుకు యత్నించిన చిరుత.. వాటికే చిక్కి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలంలో చోటుచేసుకుంది.

leopard

బూర్గుపల్లి శివారు దేవునిగుట్ట సమీపంలోని పొలంలో రైతు నవాజ్‌రెడ్డి పశువుల పాకలోని గేదె దూడలపై దాడి చేయబోయింది. దీంతో పక్కనే ఉన్న గేదెలు మూకుమ్మడిగా చిరుతపై ఎదురుదాడికి దిగాయి. ఈ క్రమంలో చిరుతకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత కొంతదూరం వెళ్లి అక్కడే నడవలేని స్థితిలో అచేతనంగా పడిపోయింది. సమాచారం తెలుసుకొని జనం భారీగా తరలివచ్చారు. ఓ వైపు కాళ్లకు గాయాలై నడవలేక పడిపోయిన చిరుత ప్రజలను చూసి గాండ్రించడంతో బెంబేలెత్తారు. కాసేపటికి గ్రామస్తులు ఓ బుట్టను నీటితో నింపి సమీపంలో ఉంచగా దాహం తీర్చుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత గాయాలను పరిశీలించారు. హైదరాబాద్‌ జూపార్క్‌ నుంచి రెస్క్యూ టీం చిరుతకు మత్తుమందు ఇచ్చి నెహ్రూ జూపార్క్‌కు తరలించింది.