ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడు

న్యూ ఢిల్లీ- దేశ న్యాయ వ్యవస్థలో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. దేశంలో మొట్ట మొదటిసారి ఓ స్వలింగ సంపర్కుడిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడిని సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేస్తున్న 49 ఏళ్ల సౌరభ్‌ కృపాల్‌ ను సుప్రీం కోర్టు కొలీజియం న్యాయమూర్తిగా ప్రతిపాదించింది. ఈ నెల 11న జరిగిన సమావేశంలో సౌరభ్‌ కృపాల్‌ కు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే సిఫారసును కొలీజియం ఆమోదించింది. ఐతే కొలీజియం సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. కృపాల్‌ ఆక్స్‌ ఫర్డ్‌, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో నాయ్య శాస్త్రం చదివారు. ఆయన తండ్రి భూపీందర్‌నాథ్‌ కృపాల్‌ 2002 మే నుంచి నవంబరు మధ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

Saurabh Kirpal

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. న్యాయమూర్తిగా సౌరభ్‌ కృపాల్‌ పేరును ఢిల్లీ హైకోర్టు కొలీజియం 2017లోనే సిఫార్సు చేసింది. కానీ సౌరభ్ కృపాల్‌ స్వలింగ సంపర్కుడు కావడం వల్ల 2018, 2019లో మూడుసార్లు సుప్రీం కోర్టు కొలీజియం సమావేశమైనప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. సౌరభ్ కృపాల్‌ లైంగిక ఇష్టాయిష్టాలపై నిఘా వర్గాల సమాచారం రావడంతో ఈ సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె, కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కు వివరణ కోరుతూ లేఖ రాశారు.

సౌరభ్ కృపాల్‌ భాగస్వామి స్విస్‌ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న యూరోపియన్‌ అయినందువల్ల అతడి జాతీయతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గతంలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మరిప్పుడు మరోసారి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సౌరభ్ కృపాల్ ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేయడంతో, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.