విశాఖలో భూకంపం.. ఒక్కసారిగా వణికిన స్టీల్ సిటీ

వైజాగ్ సిటీ- సారగతీరం విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాసేపు ఉక్కుసిటీ గజ గజ వణికింది. అవును విశాఖ నగరంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకెన్ల పాటు విశాఖలో భూమి స్పల్పంగా కంపించింది. దీంతో విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆదివారం ఉదయం 7.15 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు. నగరంలోని అసిల్‌ మెట్ట, అక్కయ్య పాలెం, తాటిచెట్ల పాలెం, సీతమ్మధార, అల్లిపురం, మధురానగర్, రైల్వే న్యూకాలనీ, బీచ్‌ రోడ్, ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని గుర్తించారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో పలు చోట్ల అపార్ట్‌ మెంట్ భవనాలకు పెచ్చులూడిపడ్డాయని స్థానికులు తెలిపారు.

earthquake 1

ముందు బాంబు పేలిన శబ్దం వినబడిన తర్వాత భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ఏం జరిగిందో అర్ధం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గోపాలపట్నం, సింహాచలం, అడవివరంలోనూ భూమి కంపించింది. దీనిపై భూభౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. అయితే ఈ భూకంపం ఎంత శాతం రిక్టర్ స్కేల్ పై నమోదు అయిందో అధికారులు ప్రకటించాల్సి ఉంది.

కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఫాల్ట్ లైన్ ఉందని, దాని ప్రభావంతో విశాఖపట్టణానికి భూకంపాలు, సునామీ ముప్పు పొంచి ఉందని గతేడాది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరించింది. తూర్పుతీరానికి 100 కిలో మీటర్ల దూరంలో, బంగాళాఖాతంలో 300 కిలో మీటర్ల పొడవున ఫాల్ట్‌ లైన్‌ ఉన్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చిచెప్పింది.