ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. దగ్గుబాటి రానా కూడా ఇందులో మరో హీరోగా నటిస్తున్నారు. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ కు రీమేక్ గా రూపొందుతోన్న భీమ్లా నాయక్ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు.
తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని త్రివిక్రమ్ కథలో మార్పులు, చేర్పులు చేశారు. నిత్యామీనన్ ఇందులో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తుండగా, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ సిన్సియర్ ఫోలీస్ ఆఫీసర్, వీఆర్‌సీ తీసుకున్న మిలటరీ ఆఫీసర్‌కి మధ్య ఈగో సమస్యలు వచ్చినప్పుడు ఏం జరిగిందనేదే భీమ్లా నాయక్ కథ.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పాటలకు ఆడియెన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. భీమ్లా నాయక్ ను ముందుగా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలని భావించారు. ఐతే చివరి నిమిషంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పోటీలోకి రావడంతో, జనవరి 26న విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భీమ్లా నాయక్ థియేట్రికల్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు భీమ్లా నాయక్ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాకు ఆయన 40 కోట్ల భారీ మొత్తం చెల్లించారని ఫిల్మ్ నగర్ టాక్. వకీల్ సాబ్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా సత్తా చాటిన పవన్, ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ అదే మ్యాజిక్ చేస్తారని దిల్ రాజు అంచనా వేస్తున్నారట. మరి మిగతా ఏరియాల్లో ఎంత మొత్తానికి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతాయన్నదానిపై టాలీవుడ్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.