హైదరాబాద్ మార్కెట్లోకి బజాజ్ చేతక్ ఈ స్కూటర్, ఒక్కసారి చార్జ్ చేస్తే

టెక్నాలజీ డెస్క్- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న చమురు ధరల కారణంగా వాహనదారులు ఆంధోళన చెందుతున్నారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు వంద రూపాయలు దాటింది. దీంతో సామాన్యులు బండి బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. సాధ్యమైనంత వరకు బస్సులు, ఇతర పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ ను వాడి ప్రయాణాలు సాగిస్తున్నారు.

ఇదిగో ఇటువంటి సమయంలో ఈ బైక్ లు, ఈ కార్లు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వాహనాలకు రోజు రోజుకు డిమాండ్ పేరుగుతోంది. చాలా కంపెనీలు ఎలక్ట్రానిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో చేతక్‌ ఈ స్కూటర్‌ బుకింగ్స్‌ను బజాజ్‌ ఆటో ప్రారంభించింది. బెంగళూరు, చెన్నై, పుణే సహా ఇప్పటి వరకూ ఏడు నగరాల్లో చేతక్‌ ఈ స్కూటర్‌ ను విడుదల చేశామని కంపెనీ తెలిపింది.

bajaj chetak electric scooter 1

ఆయా నగరాల్లో లభించిన స్పందన స్థాయిలోనే హైదరాబాద్‌లో కూడా ఈ స్కూటర్లకు స్పందన వస్తుందని భావిస్తున్నట్లు బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ చెప్పారు. హైదరాబాద్‌లోని కొన్ని డీలర్‌షిప్‌ షోరూమ్‌ల వద్ద ఈ స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచుబోతున్నారు. 2 వేల రూపాయలు చెల్లించి www.chetak.com వెబ్‌ సైట్‌లో ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ స్కూటర్‌ ఎక్స్‌ షో రూమ్‌ ధర 1,44,175 రూపాయలు. ఈ స్కూటర్ బ్యాటరీ కేవలం 5 గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ అవుతుంది. ఒకసారి చార్జింగ్‌తో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీకి 3 సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్ల వరకూ వారెంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇక 12,000 కిలోమీటర్ల ప్రయాణం లేదా ఒక ఏడాది తర్వాత ఈ స్కూటర్ కు సర్వీసింగ్‌ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో తమ ఈ స్కూటర్ కు భారీ స్పందన వస్తుందని బజాజ్ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.