కొందరు వెండితెరపై మంచి స్టార్లుగా ఎదిగిన తర్వాత.. ఆ స్టార్డమ్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా రావడమే కాదు నటి ఆర్కే రోజాలాంటి వారు మంత్రులుగా కూడా ఎదిగారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాత్రం ముందు రాజకీయ నేతగా ఎదిగి.. మంత్రిగా చేసిన తర్వత వెండితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే ఆవిడ నటించిన సినిమా జులై 22న ఏపీలోని పలు థియేటర్లలో విడుదల కూడా అయ్యింది.
జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా చేసిన పుష్ప శ్రీవాణి.. ఇటీవల జరిగిన మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా పదవిని కోల్పోయారు. ఆ తర్వాత పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. అయితే పదవి పోయిందని ఆవిడ సైలెంట్ అయిపోయారని భావించారు. కానీ, జులై 22న థియేటర్లలో “అమృత భూమి” అనే సినిమాలో ప్రధాన పాత్రలో పుష్ప శ్రీవాణిని చూసి అంతా షాకయ్యారు.
పుష్ప శ్రీవాణికి మొదటి నుంచి నటనపై మక్కువ ఎక్కువని అందరికీ తెలిసిందే టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు నేరుగా వెండితెరపై చూడగానే అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజెప్పేలా పార్వతీపురానికి చెందిన జట్టు ఆశ్రమం, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కించారు. కోరుకొండ బ్రహ్మానందం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
స్వతహాగా పుష్ప శ్రీవాణి వారి ఇంట్లో పెరటి సేద్యం చేస్తుంటారు. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా పండ్లు, కూరగాయలు పెంచుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే వ్యవసాయం మీద మక్కువతోనే ఈ సినిమాలో నటించినట్లు మాజీ మంత్రి తెలియజేశారు.
ఈ సినిమాలో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజెప్పే ఉపాధ్యాయురాలి పాత్రలో ఆవిడ నటించారు. అయితే ప్రజాప్రతినిధిగా ఉండిపోయారా? లేక నటిగా కూడా కొనసాగుతారా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. పుష్ప శ్రీవాణి నటిగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.