బంగార్రాజు మూవీ రివ్యూ

ఆరేళ్ల కిందట సంక్రాంతికే వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కి, ప్రేక్షకుల ముందుకి వచ్చింది ‘బంగార్రాజు’ మూవీ. మరి.. అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న “బంగార్రాజు” అంచనాలను అందుకున్నాడో, లేదో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

“సోగ్గాడే చిన్నినాయనా”లో కొడుకు జీవితాన్ని చక్కదిద్దిన బంగార్రాజు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక బంగార్రాజు వారసుడైన రాముకు బిడ్డ పుట్టాక.. అతడి భార్య పురిట్లోనే చనిపోతుంది. తల్లి లేని ఆ బిడ్డకి సత్తెమ్మ(రమ్యకృష్ణ) బంగార్రాజు అని తన భర్త పేరే పెట్టుకుంటుంది. కానీ.., చిన్న బంగార్రాజు( నాగచైతన్య) కూడా తాత బుద్దులతోనే పెరిగి పెద్ద అవుతాడు. కానీ.., సత్తెమ్మ చనిపోయాక చిన్న బంగార్రాజు పరిస్థితి దారుణంగా మారుతుంది. శత్రువులు బంగార్రాజుని చంపాలని కూడా చూస్తుంటారు. సరిగ్గా.. ఇలాంటి సమయంలో మనవడి కోసం పెద్ద బంగార్రాజు( నాగార్జున) స్వర్గం నుండి మళ్ళీ భూమి మీదకి వస్తాడు. అక్కడ నుండి బంగార్రాజు ఆత్మ మనవడి శరీరంలో చేరి, స్వకార్యం, స్వామికార్యం ఎలా పూర్తి చేశాడు అన్నదే ఈ చిత్ర కథ.

ఇది కూడా చదవండి:

సౌత్‌లో మొదటి హీరో! అరుదైన ఘనత సాధించిన అల్లు అర్జున్‌

విశ్లేషణ:

“సోగ్గాడే చిన్నినాయనా” విడుదలైనప్పుడు అందరూ అందులో లాజిక్స్ గురించి మాట్లాడారు. కానీ.., సాధారణ ప్రేక్షకుడు మాత్రం ఆ సినిమాలోని మ్యాజిక్ ని పట్టుకున్నాడు. అందుకే ఆ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు బంగార్రాజు మూవీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఫాంటసీ చిత్రాలలో సినిమాటిక్ లిబరిటీకి కాస్త ఎక్కువ స్కోప్ ఉంటుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దీనినే బాగా వాడుకున్నాడు. అలా.. వాడుకున్నాడు కాబట్టే కథకి కావాల్సిన మాస్ మసాలా పాయింట్స్ చాలా పడ్డాయి.

ఈ కథలో తప్పుఒప్పుల గురించి పెద్దగా విశ్లేషించాల్సిన పని లేదు. దర్శకుడు తాను చెప్పాలి అనుకున్న కథని నీట్ గా ప్రజెంట్ చేశాడు. ఇక చిన్న బంగార్రాజు పాత్రలో నాగచైతన్యని చూస్తున్నంత సేపు.. దసరా బుల్లోడు సినిమాలో ఏయన్నార్ ని చూసిన ఫీలింగే కలుగుతుంది. అంతగా చైతు ఈ పాత్రలో లీనమై నటించాడు. ఇక నాగార్జున తనకి బాగా సెట్ అయ్యే బంగార్రాజు క్యారెక్టర్ లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. చిన్న చిన్న ఎమోషన్స్ మిస్ కావడం బంగార్రాజు సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు. కానీ.., గోదావరి అందాలను అద్భుతంగా చూపించి దర్శకుడు సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాడు.

ఇక హీరోయిన్ కృతిశెట్టి పల్లెటూరు పడుచుగా మెప్పించింది. మిగతా నటీనటులు అంతా తమతమ పాత్రల పరిధి మేర బాగానే రాణించారు. టెక్నీకల్ కూడా బంగార్రాజుకి బెస్ట్ టీమ్ కుదిరింది. అనూప్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన బెస్ట్ వర్క్ ఇచ్చినా.. కథ మీద, కామెడీ మీద ఇంకాస్త శ్రద్ద పెట్టుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

  • నాగార్జున
  • నాగచైతన్య
  • గ్రామీణ నేపధ్యం
  • పాటలు

మైనస్ పాయింట్స్ :

  • ఊహకి అందే కథ, కథనాలు
  • కామెడీ పండకపోవడం

చివరి మాట:
బంగార్రాజు పండక్కి వచ్చిన పండగలాంటి సినిమా.