హిందూ సంప్రదాయంలో పెళ్లంటే ఎన్ని మధురానుభూతులు ఉంటాయో అందరకి తెలుసు. తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, బంధువుల సందడి, మూడు ముళ్లు ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే వధూవరుల జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు.
ఇంతటి మధురానుభూతిని అందించే పెళ్లి ఎలాంటి సందడి లేకుండా జరిగితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇద్దరు మగ అమెరికా దోస్తులు, ఒక భారత సంతతి యువకుడి పెళ్ళిలో హిందూ సంప్రదాయంలో మెరిశారు. పట్టుచీరకట్టుకొని, నుదుట బొట్టు పెట్టుకొని పెళ్లి కూతురితో కలిసి చికాగోలోని మండపానికి వెళ్లారు. వాళ్లను అలా చూసి పెళ్లికొడుకు నవ్వు ఆపుకోలేకపోయాడు. పెళ్లికూతురు కూడా కొంచెం సేపు నవ్వుతూ ఉండిపోయింది. ఆ తర్వాత పెళ్లికొడుకు వాళ్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.