అదృష్టం అందరినీ వరించదు. ముఖ్యంగా లాటరీ వంటి విషయాల్లో నూటికి ఒకటి, రెండు శాతం మందికి మాత్రమే అదృష్టం వరిస్తూ ఉంటుంది. అయితే, వరించిన అదృష్టాన్ని పూర్తిగా ఆస్వాధించటానికి, ఆనందించటానికి కూడా అదృష్టం ఉండాలి. లేకపోతే పరిస్థితి థాయ్‌లాండ్‌కు చెందిన మనిత్ అనే వ్యక్తిలాగా తయారవుతుంది. కోటి రూపాయల లాటరీ తగిలిన ఆనందం అతడికి కొన్ని రోజులు కూడా ఉండలేదు. భార్య కారణంగా ఆవిరై, దిగమింగలేని బాధగా మిగిలిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. థాయ్‌లాండ్‌కు చెందిన మినిత్ అనే వ్యక్తికి కొద్దిరోజుల కిందట 6 మిలియన్ బాత్‌ల లాటరీ తగిలింది. మన ఇండియన్ కరెన్సీలో దాని విలువ 1.3 కోట్ల రూపాయలు.
ఇంత పెద్ద మొత్తం లాటరీ తగలటంతో మనిత్ కుటుంబం ఎంతో సంతోషించింది. ఈ నేపథ్యంలోనే మనిత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన లాటరీ డబ్బులలో కొంత భాగాన్ని గుడికి ఇవ్వదలిచాడు. అంతేకాదు! తన ఆనందాన్ని పంచుకోవటానికి కుటుంబసభ్యులతో ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీ జరుగుతున్న సమయంలో అతడి భార్య అంగ్‌కరనాత్‌తో ఓ గుర్తు తెలియని వ్కక్తి ఉండటం చూశాడు. ఎవరా వ్యక్తి అని ఆమెను అడిగాడు. తమ బంధువు అని ఆమె చెప్పింది. పార్టీ జరుగుతున్న సమయంలోనే భార్య, అతడు కనిపించకుండా పోయారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. లాటరీ డబ్బులు కూడా కనిపించలేదు. దీంతో మనిత్‌కు విషయం అర్థం అయింది. తన భార్య లాటరీ డబ్బులు తీసుకుని పార్టీకి వచ్చిన ప్రియుడితో జంప్ అయిందని అర్థం చేసుకున్నాడు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ విషయంలో పోలీసులు సహాయం చేయలేమని చేతులు ఎత్తేశారు. ఎందుకంటే.. మనిత్‌కు అంగ్‌కరనాత్‌కు అధికారికంగా పెళ్లి కాలేదు. 26 ఏళ్లుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇదే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి ఇబ్బందిగా మారింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అతడు ఆ డబ్బును భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చాడని, దాన్ని చట్టపరంగా వెనక్కు తీసుకురాలేమని అన్నారు. ఆమె అంతట ఆమె తిరిగి వస్తే సరిపోతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మనిత్ మీడియా సహాయంతో భార్యను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక, ఈ విషయంపై మనిత్ మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటివరకు మా బంధంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమె ప్రియుడితో లేచిపోయే వరకు కూడా ఆమెకు ఓ ప్రియుడు ఉన్నాడని నాకు తెలియలేదు’’ అని చెప్పాడు.