ప్రేమకి పొట్టి, పొడవు, లావు, సన్నం, రంగు వంటి బేధాలు ఉండవని, మనసుకి నచ్చితే ఆ వ్యక్తి ఎలా ఉన్నా సర్దుకుపోవడమే ప్రేమ అని అంటుంటారు. అయితే కొంతమంది మాత్రం కొలతలు వేసుకుని ప్రేమిస్తుంటారు. ఇంకొంతమంది ప్రేమలో పడ్డాక కొలతలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఆ కొలతలకి తగ్గట్టు భాగస్వామి ఫిట్ కాకపోతే వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు. సైజ్ జీరో సినిమాలో అనుష్కని హీరో ఆర్య రిజెక్ట్ చేసినట్టన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక అమ్మాయి, అబ్బాయి లావుగా ఉన్నాడని వదిలేసి వెళ్ళిపోయింది. అతను ప్రేమించకముందు ఎంత లావుగా ఉన్నాడో, ప్రేమించిన తర్వాత కూడా అంతే లావు ఉన్నాడు. అయితే మధ్యలో ఆ అమ్మాయి మారిపోయింది. అతను ఫిట్‌గా లేడని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. దీంతో ప్రియురాలి మీద కోపం పెంచుకోకుండా బుద్ధి చెప్పాలనుకున్నాడు. కసిగా కఠిన వ్యాయామాలు చేస్తూ బాగా లావుగా ఉన్న ఆ వ్యక్తి హాలీవుడ్ హీరోలా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యాడు.
ఢిల్లీకి చెందిన పువి అనే వ్యక్తి.. తన ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని మొదట్లో కొంచెం ఢీలా పడ్డాడు. ఆ తర్వాత లావుగా ఉన్నాననే కదా తనకి బ్రేకప్ చెప్పిందనుకుని తన లోపాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాడు. ఒక ఛాలెంజ్‌గా తీసుకుని తన శరీరాన్ని ఫిట్‌గా మార్చుకోవాలనుకున్నాడు. బ్రేకప్‌కి ముందు అంటే జనవరి 14 2021లో 144 కిలోలు ఉన్న పువి.. అకుంఠిత దీక్షతో వర్కవుట్లు చేస్తూ ఫిబ్రవరి 8 2022 నాటికి 70 కిలోలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏడాదికి పైగా జిమ్‌లో గంటలు గంటలు గడుపుతూ స్థూలకాయుడిగా ఉన్న పువి హాలీవుడ్ హీరోలా తయారయ్యాడు. తన వెయిట్ లాస్ జర్నీని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫిట్‌నెస్ ట్రైనీగా మారిపోయాడు.
తనలా బరువు తగ్గాలనుకునేవారికి ఆన్‌లైన్‌లో కోర్స్ ఆఫర్ చేస్తున్నాడు. వారెవ్వా ఇతన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటే ఆత్మహత్యలే చేసుకోరు. ఇతన్ని చూసిన నెటిజన్లు పువికి అభినందనలు తెలియజేస్తున్నారు. వాట్ ఏ గ్రేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ ప్రశంసిస్తున్నారు. బ్రేకప్ చెప్పకుండా ప్రియుడ్ని సపోర్ట్ చేసి ఉంటే పువి పక్కన ఆమె కూడా ఉండేదని, పువిని వదులుకున్న ఆమె ఇప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివేంజ్ అని ఊరికే అనలేదు. మనల్ని ఎవరైనా బాధపెడితే గెలిచి చూపించాలని పువి నిరూపించాడు. పువి ప్రేమ కథలో ప్రియురాలు ఓడిపోయింది. ప్రస్తుతం పువి తన ఫిట్‌నెస్‌తో ప్రేమలో ఉన్నాడు. ఇక జీవితంలో ఓడిపోడు. మరి బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిపై పగ పెంచుకోకుండా.. ఫిట్‌నెస్‌తో బుద్ధి చెప్పిన పువిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: అంధత్వం ఓడిపోయింది.. ఏకంగా మైక్రోసాఫ్ట్‌లో రూ.51 లక్షల ప్యాకేజీతో జాబ్!