RS 10 Coins: పది రూపాయల నాణేలు అందుబాటులోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ, అవి వాడేవాళ్లు మాత్రం కరువయ్యారు. జనం వాటిని వద్దంటున్న నేపథ్యంలో షాపుల్లో కూడా వాటిని తీసుకోవటానికి భయపడుతున్నారు. ఒకరకంగా 10 రూపాయల నాణేలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అధికారులు ఎన్ని చెప్పినా.. ఎంత అవగాహన కల్పించినా ప్రజలు, దుఖానాదారులు మారటం లేదు. ఈ నేపథ్యంలో 10 రూపాయల నాణేల వాడకంపై అవగాహన కల్పించటానికి ఓ యువకుడు ఓ వినూత్నమైన పనికి శ్రీకారం చుట్టాడు. దాదాపు 60 వేల 10 రూపాయల కాయిన్లు సేకరించాడు. వాటితో ఆరు లక్షల కారు కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, ఆరూరుకు చెందిన వెట్రివేల్ అనే యువకుడి తల్లి ఓ షాపును నిర్వహిస్తోంది. షాపునకు వచ్చే కస్టమర్లు పది రూపాయల నాణేలను ఇచ్చి సరుకులు కొనేవారు. కానీ, వాటిని వెనక్కు తీసుకునేవారు కాదు. దీంతో అతడి ఇంట్లో పెద్ద మొత్తంలో పది రూపాయల నాణేలు పేరుకుపోయాయి. ఇంట్లో ఉన్న పిల్లలు ఆ పది రూపాయల కాయిన్లతో ఆడుకునేవారు.
ఎందుకలా డబ్బులతో ఆడుకుంటున్నారని వారిని ప్రశ్నిస్తే.. చెల్లని డబ్బుల్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తావు అని అడిగేవారు. వెట్రివేల్ వారిని కోప్పడి పది రూపాయల నాణేల్ని వెనక్కు తీసుకునేవాడు. ఇలాంటి సమయంలో.. నెల రోజుల క్రితం అతడికో ఆలోచన వచ్చింది. పది రూపాయల నాణేలు చెల్లుతాయని ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నాడు. ఇందుకోసం ఓ నెల రోజులు కష్టపడి దాదాపు 60 వేల పది రూపాయల నాణేలు సేకరించాడు. మొత్తం ఆరు లక్షల రూపాయలు పోగుచేశాడు. ఆ చిల్లర డబ్బుల్ని మొత్తాన్ని ధర్మపురిలోని ఓ ప్రముఖ కార్ల షోరూమ్‌కు తీసుకుపోయాడు. తనకో కారు కావాలని మేనేజర్‌ను అడిగాడు. చిల్లర డబ్బులతో కారా?.. అని ఆ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. ఏంటిది నాకు? అని విసుక్కున్నాడు.
ఆ తర్వాత వెట్రివేల్ చెప్పింది విని కారు అమ్మటానికి ఒప్పుకున్నాడు. వెట్రివేల్ కుప్పలుగా తెచ్చిన 10 రూపాయల నాణేలతో కారు కొనుక్కున్నాడు. ఈ సందర్భంగా వెట్రివేల్ మాట్లాడుతూ.. ‘‘ మా అమ్మ ఓ కిరాణా షాపు నడుపుతోంది. మా ఇంట్లో చాలా పది రూపాయల నాణేలు ఉన్నాయి. ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవటం లేదు. బ్యాంకులు కూడా తీసుకోవటం లేదు. పది రూపాయల నాణేల్ని లెక్కబెట్టడానికి మనుషులు లేరంటా వాటిని తీసుకోవటం లేదు. ఆర్‌బీఐ వాటిని చెల్లవని చెప్పకపోయినా బ్యాంకులు ఎందుకు వాటిని తీసుకోవటం లేదు? దానిపై ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని అన్నాడు. మరి, పది రూపాయల నాణేల వాడకంపై అవగాహన కల్పించటానికి వెట్రివేల్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nizamabad: రియల్ శ్రీమంతుడు.. పుట్టిన ఊరిలో రూ. 7 కోట్లతో అనాథాశ్రమం