Viral Video: ప్రేమలో పడ్డ వాళ్లు తమకిష్టమైన వారి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. కొద్దిపాటి దూరాన్ని కూడా భరించలేని పరిస్థితి వస్తుంది. హార్మోన్స్ ప్రభావం కారణంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నట్లు అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు అవతలి వ్యక్తిని చూడటానికి ఏమైనా చేయాలి అనిపిస్తుంది. అలా అనిపించిన ఓ యువకుడు తన ప్రియురాలిని చూడటానికి అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ అడ్డంగా దొరికిపోయాడు. వీళ్ల ప్రేమను చూసిన పెద్దలకు ముచ్చటేసింది కాబోలు.. అర్థరాత్రి వేళ కూడా చూడటానికి వస్తున్నాడంటే..
మా బిడ్డను బాగా చూసుకుంటాడు అనుకున్నారు ఏమో.. అమ్మాయికి, అబ్బాయికి వెంటనే పెళ్లి చేసేశారు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బిహార్, మోతిహారికి చెందిన ఓ యువతి, యువకుడు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఆ ప్రేమలో ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి సదరు యువకుడికి తన ప్రియురాలిని చూడాలన్న కోరిక కలిగింది. ప్రియురాలికి ఆ విషయం చెప్పి, ఆమె ఇంటికి బయలుదేరాదు. అర్థరాత్రి సమయంలో ఇంటి దగ్గరకు చేరుకున్నాడు.
చీకట్లో తచ్చాడుతూ తన ప్రియురాలిని చేరుకున్నాడు. ఇద్దరూ కలుసుకుని ఏకాంతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు వారిని చూశారు. సాధారణంగా అయితే, వారిని పెద్దలు కొడతారు. కానీ, ఆ ఇంటి పెద్దలు అలా చేయలేదు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. యువతి ఏడుస్తున్నా బలవంతంగా ఇద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి చేస్తున్నపుడు సదరు యువతి ఏడుస్తూ ఉంది. కోరుకున్న వాడితో పెళ్లి జరుగుతోందన్న సంతోషం ఆమెలో కొంత కూడా కనపడలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.