ఓ పాట ప్రపంచాన్ని ఉపేయాలంటే.. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ కంపోజ్ చేయాలి. ఓ స్టార్ సింగర్ ఆ పాటని ఆలపించాలి. ఓ స్టార్ హీరో ఆ పాటలో నటించాలి. పాప్ సింగర్స్ కో, రాక్ స్టార్స్ కో మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం ఇదంతా. కానీ.., ఓ సామాన్యుడు పాడే లల్లాయి పాటకి ఇంతటి ఆదరణ సాధ్యమా? పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వ్యాపారి గొంతుకి.. ప్రపంచం అంతా దాసోహం అనడం సాధ్యమా? ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేశాడు.. పశ్చి బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ అనే పల్లీల వ్యాపారి. అతని తలరాతని మార్చి, ఇప్పుడు అందరినీ ఒక ఊపు ఊపేస్తున్న ఆ పాటే “కచ్చా బాదం”.
ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో చూసినా, ఏ రీల్స్ చూసినా, ఏ రీమిక్స్ చూసినా అంతా కచ్చా బాదం మేనియానే. దేశ విదేశాల్లో అంతా కచ్చా బాదం అంటూ రాగాలు తీస్తున్నారు. ఆ పాటలోని అర్థం తెలియకపోయినా, భాష అర్థం కాకపోయినా అందరి నోటా కచ్చా బాదం అన్న మాట నానుతూనే ఉంది. మరి.. భుబన్ బద్యాకర్ అసలు ఈ పాటని ఎలా సృష్టించారు? ఆ పాట పుట్టక వెనుక ఉన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏమిటి? కచ్చా బాదం పాటతో వచ్చిన క్రేజ్ కారణంగా భుబన్ బద్యాకర్ ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ ని అందుకుంటున్నారు? అసలు ఆయన లైఫ్ ఎలా టర్న్ అయ్యిందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భుబన్ బద్యాకర్ ది సాధారణ నిరుపేద కుటుంబం. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలోని కురల్ జూరి ఆయన స్వగ్రామం. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో నివసిస్తున్నాడు భుబన్ బద్యాకర్. రైతుల నుండి పచ్చి వేరుశనగకాయలు కొనుగోలు చేయడం.. ఓ పాత స్కూటర్ పై తరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ వేరుశనగకాయలు అమ్మడం భుబన్ బద్యాకర్ పని. కానీ.. మొదట్లో అంతగా అమ్మకాలు ఉండేవి కావు. వేరుశనగ అమ్ముడుపోక భుబన్ బద్యాకర్ కుటుంబం పస్తు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. దీంతో.. తాను పల్లీలు అమ్మే పద్ధతి మార్చుకున్నాడు భుబన్ బద్యాకర్. “మీ దగ్గర పాత గాజులు, పాత గొలుసులు ఉంటే, మీరు వాటిని నాకు ఇవ్వవచ్చు, నేను మీకు సమానమైన వేరుశెనగలను ఇస్తాను” అంటూ.. తనకి తానుగా ఓ పాటని రాసుకున్నాడు. దానికి “కచ్చా బాదం” అంటూ ట్యూన్ కట్టాడు. భుబన్ బద్యాకర్ గ్రామాల్లో ఈ పాట పాడుతూ.. పల్లీలు అమ్మడం మొదలు పెట్టాక అతని పల్లీలు బాగా అమ్ముడు పోసాగాయి.
భుబన్ బద్యాకర్ ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ జనం గుమి కూడటం, అతన్ని కచ్చా బాదం పాట పాడమని అడగడం పరిపాటి అయిపోయింది. వ్యాపారం కోసం భుబన్ బద్యాకర్ కూడా కొన్ని రోజులు అలానే పాడుతూ వచ్చాడు. కానీ.., పదే పదే ప్రజలంతా తనని ఆ పాట పాడమని విసుగు తెప్పిస్తుండటంతో ఓసారి పోలీసులకి కూడా కంప్లైంట్ చేశాడు. అయినా.. కచ్చా బాదం ఫ్యాన్స్ ఊరుకోలేదు. భుబన్ బద్యాకర్ కి ఆ పాట పాడక తప్పలేదు. కానీ.., ఎవరో గ్రామస్థుడు భుబన్ బద్యాకర్ పాటని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో.. కచ్చా బాదం పాటకి విపరీతమైన రీచ్ వచ్చింది. తరువాత ‘ఏక్తారా’ అనే యూట్యూబ్ ఛానెల్ కచ్చా బాదం పాటకి రీమిక్స్ చేసి.. ఆఫీషియల్ సాంగ్ లా విడుదల చేసింది. అతి తక్కువ సమయంలోనే కచ్చా బాదం 20 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇక అప్పటి నుండి ఈ పాటకి నెటిజన్స్ అంతా రీల్స్ చేయడం మొదలు పెట్టడంతో కచ్చా బాదం పాట, ఆ పాట సృష్టి కర్త భుబన్ బద్యాకర్ వరల్డ్ ఫేమస్ అయిపోయారు.
కచ్చా బాదంతో వచ్చిన క్రేజ్ తో భుబన్ బద్యాకర్ లైఫ్ లో చాలా బిజీ అయిపోయాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై టెలికాస్ట్ అవుతున్న “దాదాగిరి నెవర్ ఎండ్” 9వ సీజన్ లో భుబన్ బద్యాకర్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలో, మమతా బెనర్జీ సభల్లో కూడా భుబన్ బద్యాకర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇవన్నీ కాక ప్రైవేట్ ఆల్బమ్స్ చేసే చాలా కంపెనీలు భుబన్ బద్యాకర్ చేత పాటలు పాడించుకోవడం మొదలు పెట్టాయి. ఆఖరికి ఫ్లయిట్ లో ఎయిర్ హోస్టర్స్ కూడా కచ్చా బాదం పాటనే హమ్ చేయడం మొదలు పెట్టారు. ఇంత క్రేజ్ రావడంతో భుబన్ బద్యాకర్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి.
భుబన్ బద్యాకర్ కి ఇప్పుడు పేరుకైతే లోటు లేదు. కానీ.., వచ్చిన క్రేజ్ అతనికి కాసులు మాత్రం తీసుకుని రాలేకపోతుంది. చుట్టు పక్కల గ్రామాల నుండి అంతా వచ్చి తనతో ఫోటోలు దిగుతున్నారు. సెలబ్రెటీలు ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు. కానీ.., తనని పేదరికం నుండి బయటపడేసే చేతులు మాత్రం ముందుకి రావడం లేదు. తన చిన్న గుడిసె స్థానంలో ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలి అన్నది భుబన్ బద్యాకర్ కోరిక. అందుకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకి వస్తారేమో అని భుబన్ బద్యాకర్ ఈనాటికీ ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈ విషయంలో అతని ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. కానీ.., ఓ సామాన్యుడి పాట.. ఇలా మొత్తం ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేయడం అన్నది మాత్రం నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు. చూశారు కదా? ఇది కచ్చా బాదం పాట వెనకున్న హిస్టరీ. మరి.. ఈ పాటపై, ఈ పాట సృష్టి కర్త భుబన్ బద్యాకర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.