సాధారణంగా సోదరుడి పెళ్లి అంటే ఆ ఇంటి ఆడ పిల్లలకు పెద్ద పండగ. సోదరుడి పెళ్లి వేడుకలో వారు చేసే సందడి అంతా ఇంతా కాదు. అతని పెళ్లిని అంతా తామై చూసుకుంటారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చే అతిథులకు మర్యాదులు చేస్తుంటారు. అందరికి భోజనeలు అందేలా చూసుకుంటారు. పెళ్లి అనంతరం వేరే పనుల్లో బిజీ అవుతారు. అయితే ఓ అక్క మాత్రం తన సోదరుడి పెళ్లిలో చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. ఇంతకు ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం.
దానాల్లో అన్నదానానికి మించిన గొప్పది మరొకటి లేదంటారు పెద్దలు. ఆ అన్నం గొప్పతనం తెలిసిన వ్యక్తే పాపియ కర్ అనే మహిళ. కోల్‌కతాకి చెందిన పాపియ కర్ తన సోదరుడి పెళ్లి ఘనం చేసింది. అనంతరం సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పెద్ద పెద్ద బకెట్లు, పాత్రల్లో నింపి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కోల్‌కతా సబర్బన్ రైల్వే స్టేషన్ రాణాఘాట్ కు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అనాథలను, భిక్షాటన చేసేవారిని పిలిచి తానే స్వయంగా వారికి వడ్డించింది. సంప్రదాయ దుస్తుల్లో ఆమె వారికి ఆహారాన్ని అందించటాన్ని నీలాంజన్ మండల్ అనే ఫోట్ గ్రాఫర్ గమనించి తన కెమెరాల్లో బంధించాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.
సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్లంటే ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోరూరించే వంటకాలతో విందులు, సంగీత్ లు, బరాత్ లు..ఇలా ఎన్నో ఉంటాయి. ఈ వేడుకల్లో చాలా ఆహారం మిగిలిపోతుంది. చాలా మంది స్వచ్ఛంద సంస్థలకు ఫోన్ చేసి మా వద్ద ఆహారం మిగిలిపోయింది తీసుకెళ్లండి అంటారు. కానీ పాపియ కర్ తానే స్వయంగా అర్థరాత్రి సమయంలో అనాథల ఆకలి తీర్చింది. ఆమె చేసిన ఈ మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు. “ఇలాంటి వారిని చూసినప్పుడే ఈ లోకంలో ఇంకా మానవత్వం ఉందన్న నమ్మకం కలుగుతోంది. ఆమె చాలా మంచి పనిచేసింది. మిగతా వారందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి” అంటూ ఆ మహిళపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.