సినీ పరిశ్రమలో ఏ సినిమా విడుదలైనా గానీ దాదాపు శుక్రవారం నాడే విడుదల చేస్తారు. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ అందరూ శుక్రవారం సెంటిమెంట్ ని అనుసరిస్తారు. శుక్రవారమే విడుదల చేయడానికి కారణం ఏమిటి?
సినీ పరిశ్రమలో శుక్రవారానికి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజునే సినిమాలు విడుదల చేయాలి అని కంకణం కట్టుకుంటారు మేకర్స్. ఇండస్ట్రీలో చాలా వరకూ సినిమాలు శుక్రవారం పూటే విడుదలవుతాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు గురువారం కూడా విడుదలవుతున్నాయి. కలెక్షన్స్ తగ్గిపోవడంతో ఒకరోజు పెరుగుతుందని ఆశతో శుక్రవారానికి ఒక్కరోజు ముందు విడుదల చేస్తున్నారు. కానీ చాలా వరకూ శుక్రవారం నాడు విడుదల చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న అంటే శుక్రవారం విడుదలయ్యింది. ఏప్రిల్ 21న అంటే శుక్రవారం నాడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష సినిమా విడుదలైంది. సినిమా విడుదలకు శుక్రవారాన్ని మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే?
శుక్రవారం రిలీజ్ అనేది ఇక్కడ లేదు. మన దేశంలో ఎప్పుడు పడితే అప్పుడు విడుదలయ్యేవి. అలా విడుదలైన వాటిలో బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ నటించిన నీల్ కమల్, తెలుగులో పాతాళభైరవి, మాయాబజార్ సినిమాలు ఉన్నాయి. ఇలా చాలా సినిమాలు శుక్రవారం విడుదల కాలేదు. అయితే శుక్రవారం విడుదల సాంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చింది అంటే మాత్రం హాలీవుడ్ నుంచే వచ్చింది. అంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు, వారాలతో సంబంధం లేకుండా సినిమాలు విడుదలయ్యేవి. మొదట్లో శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్లు పెద్దగా వచ్చేవి కావు. దీంతో మేకర్స్ అందరూ కూర్చుని చర్చించుకున్నారు. ఫైనల్ గా శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించారు.
ఆరోజే ఎందుకంటే అప్పట్లో కార్మికులకు వేతనాలు వారానికొకసారి ఇచ్చేవారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే పని చేయించుకునేవారు. శని, ఆదివారాలు సెలవులు ఇచ్చేవారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ పని చేయించుకుని.. ఆరోజు సాయంత్రం జీతాలు ఇచ్చేవారు. జీతం తీసుకున్న కూలీలు, కార్మికులు ఆరోజు సాయంత్రమే కుటుంబంతో కలిసి సినిమా చూస్తారని, ఆ తర్వాత రెండు రోజులు కూడా సినిమా చూస్తారని శుక్రవారాన్ని సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. అలా మూడు రోజులు సినిమాకి కలెక్షన్లు బాగా వచ్చేవట. హాలీవుడ్ లో మొదటిగా ‘గాన్ విత్ ది విండ్’ అనే సినిమాతో శుక్రవారం రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఈ సినిమా 1939లో డిసెంబర్ 15న విడుదలైంది.
ఇక మన దేశంలో శుక్రవారం విడుదల చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హాలీవుడ్ ట్రెండ్ ని అనుసరించడం. రెండు శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్, శుభం కలుగుతుందని నమ్మకం. మొదట్లో మన సినిమాలు అమావాస్య రోజుల్లో విడుదల చేసేవారట. మనది వ్యవసాయ ఆధార దేశం. అప్పట్లో వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉండేవారు. అమావాస్య రోజున రైతులు పని చేసేవారు కాదు. దీంతో వారు సినిమా చూడడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అమావాస్య రోజుల్లో సినిమా హాల్స్ కి వెళ్లేవారు. ఆ తర్వాత హాలీవుడ్ సంస్కృతిని బాలీవుడ్ సినిమాలు, ఆ తర్వాత టాలీవుడ్ సహా ఇతర సినీ పరిశ్రమలు అనుసరించడం మొదలుపెట్టాయి.
దీనికి తోడు ప్రజలు వ్యవసాయం తగ్గించి ఇతర వృత్తులను ఎంచుకోవడం, శని, ఆదివారాలు సెలవు రావడం వంటి కారణాలతో ఈ మూడు రోజులూ సినిమా చూసేందుకు ఇష్టపడేవారు. అలా బాలీవుడ్ లో మొదటిగా శుక్రవారం విడుదలైన సినిమా మొఘల్ ఎ అజమ్. ఈ సినిమా 1960 ఆగస్టు 5న విడుదలైంది. ఇంకా ఈ ట్రెండ్ ని కొనసాగించడానికి కారణం.. మల్టీప్లెక్సుల్లో మిగతా రోజుల కంటే శుక్రవారం రోజున రెంట్ తక్కువ ఉంటుందట. నిర్మాతలు మల్టీప్లెక్స్ యజమానులకు శుక్రవారం రోజు తక్కువ రెంట్ పే చేస్తారట. అందుకే కొత్త సినిమాలను శుక్రవారం రోజున విడుదల చేస్తారు. ఏ ఇండస్ట్రీ అయినా యూనివర్సల్ పాయింట్ ఒకటే.. వీకెండ్ అంటే ఎంజాయ్ చేయాలని చాలా మంది ఫిక్స్ అయిపోతారు.
శుక్రవారం వచ్చిందంటే వీకెండ్ అని, వేడుకకు ఆరంభం అని అర్థం. శనివారం అంటే ఎక్కువ మందికి నచ్చే వారం. ఎందుకంటే తర్వాతే ఆదివారం కాబట్టి. ఇలా కొన్ని లెక్కలు వేసుకుని శుక్రవారాన్ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్నారు. అయితే సినిమా కలెక్షన్స్ సరిపోవడం లేదని కొంతమంది ఒకరోజు ముందే సినిమా విడుదల చేస్తున్నారు. అదన్నమాట విషయం. మరి శుక్రవారం పూటే సినిమాలు విడుదల చేయడానికి మీకేమైనా కారణాలు తెలిస్తే కామెంట్ చేయండి.