ప్రజా రవాణా వ్యవస్థలో చాలా మార్పులొచ్చాయి. ప్రయాణికులు ప్రభుత్వ రవాణా వాహనాలనే కాకుండా ప్రైవేట్ వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నగరాల్లో అయితే ఉద్యోగాలకు వెళ్లే వారు, అర్జెంటుగా ప్రయాణం చేయాల్సిన వారు ఎక్కువగా ప్రైవేట్ సంస్థల వాహనాల ద్వారానే ప్రయాణాలు చేస్తున్నారు.
హైదరాబాద్ వంటి నగరాల్లో ఆర్టీసి, మెట్రో సేవలు అందుబాటులో ఉన్నప్పటికి ఓలా, ఉబర్ క్యాబ్ ల ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఆర్టీసి, మెట్రో ఛార్జీలతో పోలిస్తే ఓలా, ఉబర్ లలో రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికి ప్రయాణికులు వాటికే మొగ్గు చూపుతున్నారు. దీనికి గల కారణం.. క్యాబ్ బుక్ చేసుకుంటే ఉన్న చోటుకే వచ్చి పికప్ చేసుకోవడం, కోరుకున్న చోట డ్రాప్ చేయడంతో కస్టమర్లు క్యాబ్ బుకింగ్ లకే ప్రియారిటీ ఇస్తున్నారు.
నగరాల్లో పెరుగుతున్న జనాభాతో రవాణా వ్యవస్థపై భారం పడుతోంది. ప్రభుత్వం డిమాండ్ కు తగ్గట్లుగా రవాణా ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా నగరాల్లో ఓలా, ఉబర్ వంటి సంస్థలు రవాణా రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో డ్రైవర్లు తమ క్యాబ్ లను ఓలా, ఉబర్ లలో అటాచ్ చేసి ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రయాణికులు ఈ క్యాబ్ లను బుక్ చేసుకున్నప్పడు కొన్ని సమస్యలు అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లే వారు, ఇతర పనుల నిమిత్తం అర్జెంటుగా వెళ్లాల్సిన వారు క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో వారు బుక్ చేసుకున్న క్యాబ్ బుక్ అవ్వకపోవడం, బుక్ అయినా కూడా ఎంతకీ లోకేషన్ కీ రాకపోవడం, పలు సార్లు క్యాన్సిల్ అవ్వడం, బుకింగ్ కన్ఫామ్ అయ్యాక కూడా డ్రైవర్ క్యాన్సిల్ చేయడంతో విసుగు చెందుతున్నారు.
దీంతో సమయం, డబ్బు వృథా అవుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య బెంగళూరు తర్వాత హైదరాబాద్ లో ఎక్కువగా ఉందని తేలింది. దీనిపై సెంట్రల్ కన్య్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గతేడాది స్పందిస్తూ డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేయడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేయమని కస్టమర్లను ఒత్తిడి చేయడం, ఛార్జీలు కాకుండా అదనంగా డబ్బులు అడగడం కస్టమర్ల హక్కులు ఉల్లంఘించడమే అని తెలిపారు. మరి ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేసినపుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
డ్రైవర్ రైడ్ ను క్యాన్సిల్ చేసినపుడు ఏం చేయాలి?
ప్రయాణికులు ఓలా, ఉబర్ లలో క్యాబ్ లను బుక్ చేసుకున్నప్పుడు డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేసినా లేదా సమయానికి పికప్ లోకేషన్ కి రాకపోయినా కస్టమర్లు ఆ పద్దతి అనుసరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఓలా, ఉబర్ లలో ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు రైడ్ క్యాన్సిల్ చేయకుండా.. క్యాబ్ డ్రైవర్ పికప్ లొకేషన్ కి రాకున్నా, డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేసినా సంబంధిత యాప్ లో క్యాబ్ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్న తేదీని, సమయాన్ని, క్యాబ్ క్యాన్సిలేషన్ స్క్రీన్ షాట్ ను ఇతర వివరాలతో నగర ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ లేదా వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేయాలి. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 178 ప్రకారం క్యాబ్ డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే రూ. 200 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. దానిని క్యాబ్ ఓనర్ నుంచి ట్రాఫిక్ పోలీసులు వసూలు చేస్తారు. కస్టమర్లు ఇలా చేయడం ద్వారా డ్రైవర్లు చేసే రైడ్ క్యాన్సిలేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.