గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవో 111 రద్దు గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రభుత్వం, జీవో వర్తించే ప్రాంతాల ప్రజలు.. దీన్ని రద్దు చేయాలని కోరుతుండగా.. పర్యవరణ పరిరక్షకులు మాత్రం.. GO 111 రద్దు చేస్తే భవిష్యత్తులో పెను ప్రమదం వాటిల్లుతుందని నిరసన తెలుపుతున్నారు. ఈ చర్చలు ఇలా సాగుతుండగానే.. GO 111 ఎత్తివేతకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో జీవో పరిధిలోని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ 26 ఏళ్ల కల నెరవేరనుందని, అభివృద్ధికి అడ్డు తొలగిపోనుందని స్థానికులు చెబుతున్నారు. జీవో వర్తించే ఏడు మండలాల్లోని లక్షల ఎకరాల భూమికి విముక్తి లభిస్తుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత భారీ ఎత్తున చర్చ జరుగుతున్న ఈ జీవో 111 అంటే ఏంటి.. అసలు దాన్ని ఎందుకు తీసుకువచ్చారు.. రద్దు చేయడం వల్ల ఎవరికి మేలు.. ఎవరికి నష్టం వంటి తదితర అంశాల పూర్తి వివరణ ఇక్కడ మీ కోసం..
అసలేంటి ఈ GO 111..
ఈ జీవో రావడం వెనక ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అనే సంస్థ కృషి ఉంది. 1990 ప్రాంతంలో ఓ సంస్థ హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) నుంచి కాస్ట్రాయిల్ కాంప్లెక్స్ అనే టెక్నాలజీని తీసుకుని దాని తయారీ పరిశ్రమను గండికోట దగ్గర ఏర్పాటు చేసింది. కానీ అది రసాయన పరిశ్రమ కావడంతో హైదరాబాద్‌కు తాగునీరిచ్చే గండిపేట దగ్గర రసాయన పరిశ్రమ నిర్మించకూడదంటూ ‘ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్’ నుంచి కొందరు హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు తీర్పు పరిశ్రమకు అనుకూలంగా వచ్చింది. దీంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ‘ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్’ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ చుట్టూ నిర్మాణాలపై కఠిన ఆంక్షలు పెట్టాలని ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు ఫలితంగా వచ్చిందే GO 111.
ఇది కూడా చదవండి: స్టూడెంట్ నం.1 సినిమాలో ఎన్టీఆర్‌లా.. నాన్న కోసం 16 ఏళ్లు పోరాటం!ఈ జీవో ప్రకారం ఆ చెరువుల పరిధిలోని లే అవుట్లలో 60 శాతం ఖాళీ స్థలం వదలాలి. గ్రామ కంఠం మినహా మిగిలిన చోట్లా భూమిలో 10 శాతమే నిర్మాణాలు ఉండాలి. చుట్టుపక్కల క్రిమి సంహారక మందుల వినియోగంపై పరిశీలన ఉండాలి. జీ+2 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేయకూడదు.. అంటూ ఇలా ఆ జీవోలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇక GO 111 కారణంగా రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 7 మండలాల్లోని 84 గ్రామాల్లో భూముల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి.
స్థానికులు ఏమంటున్నారు..
ప్రస్తుతం హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. జీవో అమలయ్యే ప్రాంతాల్లో మాత్రం.. భూముల ధరలు పెరగలేదు. పట్టణీకరణ కూడా పెద్దగా జరగకపోవడంతో.. అక్కడ భూములను కొనడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఈ జీవో వర్తించే ప్రాంతాల్లో నిర్మాణాల విషయంలో చాలా కఠినమైన నిబంధనలు ఉండటంతో.. ఈ ప్రాంత ప్రజలు జీఓని రద్దు చేయాలని కోరుతున్నారు. అంతేకాక ప్రస్తుతం భాగ్యనగరానికి కృష్ణా, గోదవారి జలాల సరఫరా అవుతున్నందున.. ఈ రెండు జలాశయాల వల్ల నగరానికి పెద్ద ఉపయోగం లేదు.. కనుక జీవో ఎత్తేయాలని వాదిస్తున్నారు.
ప్రభుత్వ వాదన ఏంటంటే..ఈ జీవో పరిధిలో దాదాపు 538 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. జీఓ కిందకు వచ్చే ఈ 84 గ్రామాల్లోని 1 లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయేతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. అంటే ఇది దాదాపు జీహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానం. ఇందులో 70 శాతం ఖాళీగానే ఉన్నాయి. ఈ భూముల్లోనే గ్రీన్ సిటీగా మరో మహానగరాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. హైదరాబాద్‌లో భూముల కొరత ఉన్నందున.. ఆ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వైరల్‌గా మారిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి డ్యాన్స్ వీడియో!
ఈ జీవోని రద్దు చేస్తే.. కొత్త నగరంలో భూముల క్రయవిక్రయాలు పెరిగి.. రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని ఆలోచిస్తున్నారట. అలా కొత్త నగరం రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్రపోషిస్తుందని.. ఆదాయం ఆర్జించే అంశంలో మిలిగిన రాష్ట్రాలకంటే మిన్నగా తెలంగాణ ఎదిగే అవకాశముంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ నాలుగైదు సార్లు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
పర్యావరణవేత్తలు ఏమంటున్నారు..ఎలాంటి పరిమితులు లేకుండా GO 111ను ఎత్తేస్తే ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లు మరో హుస్సేన్ సాగర్‌లా తయారవుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ జీవో వల్ల వ్యవసాయానికి సమస్య లేదు. కేవలం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే ఈ జీవోను తొలిగిస్తున్నారని వారు వాదిస్తున్నారు. ”నగరాన్ని కుండపోత వానలు, వరదల నుంచి కాపాడేవి ఇవే. వాటి చుట్టుపక్కల అక్రమ కట్టడాలను ఆపకుండా జీవోనే రద్దు చేస్తే ఎలా” అని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘‘హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడం కోసం ఇప్పుడు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వస్తోందని.. మరో వందేళ్లు నగరానికి తాగునీటి కొరత ఉండదని కేసీఆర్ అంటున్నారు. అసలు దానికి శాస్త్రీయత ఏంటి.. రానున్న కాలంలో నీటి అవసరాలు ఎలా ఉంటాయో.. వానలు ఎలా ఉంటాయో దీని గురించి కేసీఆర్ దగ్గర ఏమైనా లెక్కలున్నాయా.. కేవలం రియల్ ఎస్టేట్ వారికి మేలు చేయడం కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు’’ అని ఆరోపిస్తున్నారు. GO 111 రద్దుపై స్టే ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరుతూ పలువురు పర్యావరణవేత్తలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో చూడాలి. GO 111 రద్దుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.