ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్నమైన స్కీములు అమలు పరుస్తూ టీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే దిశగా ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీసీ సజ్జనార్ ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ తీసుకు వస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవడమే కాదు.. ఆర్టీసీకి మంచి ఆదాయం వచ్చే దిశగా ముందుకు సాగుతున్నారు. నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీములు అమలు పరుస్తున్నారు. తాజాగా ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో శుభవార్త తెలిపింది టీఎస్ఆర్టీసీ.
తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్దిక భారం తగ్గించేందుకు తెచ్చిన ‘టి-9 టికెట్’ సమయాల్లో టీఎస్ఆర్టీసీ మార్పులు తీసుకు వచ్చింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం మొదిటిసారిగా అందుబాటులోకి తెచ్చింది ఈ టికెట్. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఈ టికెట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యేది. గత కొంత కాలంగా ప్రజలు ఈ టైమింగ్ విషయంలో మార్పులు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు ఈ టికెట్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
టి-9 టికెట్ తో ఎక్స్ ప్రెస్ సర్వీసులో కూడా ప్రయాణించే వెసులుబాటు టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్ కొంటే.. తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తో పాటు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. తిరుగు ప్రయాణంలో మాత్రమే ఎక్స ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్ వర్తిస్తుంది. ఇక రూ. 20 కాంబి టికెట్ ఈ నెల 9 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ లో టీ-24, టీ-6, ఎఫ్ -24 టికెట్లను ఇప్పటికే అందిస్తుండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం టి-9 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు 040-69440000, 040-23450033 నెంబర్ల కు కాల్ చేసి తెలుసుకోవొచ్చు.