సాధారణంగా చాలా మంది జీవితంలో సుఖంగా బతికితే చాలు అనే భావనలో ఉంటారు. కానీ కొందరు మాత్రం చరిత్రలో తమపేరు నిలిచిపోయేలా ఏదైనా సాధించాలనే కసితో జీవిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఎన్నో అవరోధాలు దాటుకుని అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అయితే ఇలా తాము అనుకున్న లక్ష్యాలు సాధించటంతో పాటు అరుదైన ఘనతలు సొంతం చేసుకుంటారు కొందరు. తాము చదువుకున్న పాఠశాలకే టీచర్ గా వెళ్లడం, తమ మండలానికి అధికారిగా ఉద్యోగం రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి అరుదైన ఘటనలతో ఆ వ్యక్తి తో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అలాంటి అరుదైన ఘనతు సాధించింది డాక్టర్ రాజేశ్వరి. వైద్యవిద్య పూర్తి చేసుకుని తాను పుట్టిన ఆసుపత్రికి నేడు వైద్యురాలిగా వెళ్లింది. మరీ.. ఆమె గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…
వరంగల్ జిల్లాకు గీసుకొండ మండలం విశ్వనాథపురానికి చెందిన గిరిజన దంపతులు వాంకుడోతు రాజు, రమాదేవి దంపతుల కుమార్తె రాజేశ్వరి. ఈమె 1998 జనవరి 16న నర్సంపేట ప్రభుత్వ సామాజికి ఆసుపత్రిలో జన్మించారు. రాజు, రమదేవిలు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వారు. ఆ దంపతులిద్దరు కష్టపడి వ్యవసాయ పనులు చేస్తూ కూతర్ని చదివించే వారు. అలా వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగిన రాజేశ్వరి.. ఎంతో కష్టపడి వైద్య విద్యను పూర్తి చేశారు. ఈక్రమంలోనే ఆమెకు వివాహం కూడా జరిగింది. రాజేశ్వరి భర్త బానోతు భరత్ ప్రస్తుతం అస్సాంలో ఓఎన్జీసీలో పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన శాశ్వత నియామకాల్లో వైద్యవిధాన పరిషత్ కు రాజేశ్వరి సెలెక్ట్ అయ్యారు. ప్రతిభ ఆధారంగా నర్సంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఉద్యోగం పొందారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో సూపరిటెండెంట్ గా ఉన్న డాక్టర్ గోపాల్.. రాజేశ్వరికి బాల్యంలో వైద్యం చేశారు.
ఇప్పుడు ఆమే వైద్యురాలిగా అక్కడి వెళ్లడం విశేషం. పాతికేళ్ల కిందట పుట్టిన ఆసుపత్రికి నేడు వైద్యురాలిగా వెళ్లడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే తాను పుట్టిన జనవరి నెలలోనే బాధ్యతలు కూడా చేపట్టారు. రాజేశ్వరికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. రాజేశ్వరికి నర్సం పేట ఆసుపత్రిలో ఉద్యోగం రావడంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్వరి పుట్టిన ఊరి వారుసైతం ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మరీ.. ఇలా జన్మభూమికి సేవ చేయడం కోసం చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. అలాంటి అదృష్టవంతుల్లో రాజేశ్వరి ఒకరు. మరి.. తాను పుట్టిన ఆసుపత్రికే నేడు వైద్యురాలిగా వెళ్లిన రాజేశ్వరి కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.