ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఈ ఆనంద సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచాలు పేల్చారు. వాటిలో ఒక బాణాసంచా నిప్పు రవ్వ ఎగిరి గుడిసెపై పడడంతో గుడిసె అంటుకుంది. గుడిసె లోపల సిలిండర్లు ఉండడంతో ఒక్కసారిగా అవి పేలాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. బాంబు తరహాలో పేలుడు సిలిండర్ పేలడంతో ఆ ధాటికి పలువురి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పలువురి కాళ్ళూ, చేతులూ తెగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరిగిందని తెలిసిన ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కి, ఎంపీ నామా నాగేశ్వరావుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రమాదంలో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు.. గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపింది.