మన నిత్యజీవితంలో టూ వీలర్ కు ఉన్న ప్రాముఖ్యతే వేరు. యువత, ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా బైక్ లను వినియోగిస్తుంటారు. కాగా బైక్ నడిపేటపుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచిస్తుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా విదిస్తుంటారు. ప్రమాద సమయంలో రక్షణ కవచంలా పనిచేసే హెల్మెట్ ను ధరించడానికి కొంత మంది నిరాకరిస్తారు. హెల్మెట్ వాడకం వల్ల జుట్టు ఊడుతుందనో, లేక తలపై బరువుగా ఉంటుందన్న కారణాలతో హెల్మెట్ వాడటం మానేస్తారు. మరి ఇలాంటి వారికి తెలంగాణకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ శుభవార్త అందించింది. నూతన టెక్నాలజీని ఉపయోగించి వినూత్నమైన ఎసి హెల్మెట్ ను తయారు చేసింది. దీనిని ఉపయోగించడం వల్ల తలకు రక్షణగాను, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా తలకు చల్లదనాన్ని కల్పిస్తుంది ఈ ఎసి హెల్మెట్.
రోడ్డు భద్రతా నిబంధనల్లో భాగంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని ట్రాఫిక్ డిపార్టుమెంట్ వారు వాహనదారులకు హెల్మెట్ ధరించాలని సూచిస్తుంటారు. కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో టూ వీలర్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఇటీవల అమల్లోకి వచ్చింది. దీంతో, పుదుచ్చేరిలో హెల్మెట్ ధరించే వాహనదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో, వాహనదారులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా, తలకు చల్లదనం కలిగించేలా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీ హెల్మెట్ ను రూపొందించింది. ఒక గంటసేపు చార్జింగ్ పెట్టినట్లైతే ఎనిమిది గంటలపాటు పనిచేస్తుందని సంస్థ తెలిపింది.
ఆ సంస్థ ఆ ఎసి హెల్మెట్లను పుదుచ్చెరి రాష్ట్రంలో పరిచయం చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నమశ్శివాయం దాన్ని పరిశీలించారు. తలకు ధరించినపుడు చల్లగా, సౌకర్యవంతంగా ఉందని వారు తెలిపారు. అయితే ఈ ఏసీ హెల్మెట్ విక్రయాలు త్వరలో ప్రారంభిస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలా కూల్ కూల్ గా ఉండే హెల్మెట్ లు అందుబాటులోకి వస్తే వాహనదారులు హెల్మెట్ లు ఎక్కువగా ధరించడానికి అవకాశం ఉంటుందని సంస్థ నిర్వాహకులు అంటున్నారు. ముఖ్యంగా మండుటెండలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించే ట్రాఫిక్ పోలీసులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.