ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు బయట ఒంటరిగా వస్తే పొంచి ఉన్న వీధి కుక్కలు దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో కుక్కకాటుకు బలిఅవుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమించి చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్.. అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ ని కుక్కలు అతి దారుణంగా కొరికి చంపాయి.. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్నాయి. తాజాగా కొత్తగూడెంలో విషాదం చోటు చేసుకుంది.. కుక్కకాటుకు ఓ బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మైలుతండాకు చెందిన శిరీష (17) కుక్కకాటు కారణంగా మరణించింది. శిరీష ఆమె తండ్రి ముత్తయ్య ఇటీవల వీధిలో నడుచుకుంటూ వస్తున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తండ్రీ కూతురు తీవ్రంగా గాయపడ్డారు. ముత్తయ్య వ్యాక్సిన్ తీసుకోవడంతో బతికిపోయాడు.. వ్యాక్సిన్ తీసుకునేందుకు శిరీష నిరాకరించింది. కుటుంబ సభ్యులు, వైద్యులు ఎంత చెప్పినా తనకు ఏమీ కాదు.. వ్యాక్సిన్ తీసుకోను అంటూ మొండికేసింది. నాలుగు రోజుల క్రితం రెబీస్ లక్షణాలు కనిపించడంతో శిరీషను ఖమ్మం ఆసుపత్రిలో చూపించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే శిరీష ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఇదిలా ఉంటే దేశంలో వీధి కుక్కల దాడులు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. సంవత్సరానికి దాదాపు రెండు కోట్ల మంది కుక్కకాటు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. దీన్ని బట్టి పరిస్థితి ఎంతగా తీవ్ర తరంగా ఉందో అర్థం అవుతుంది. కుక్క కాటుకు గురైన బారిలో చాలా మంది రెబీస్ వైరస్ భారినపడి చనిపోతున్నారని నివేదికలో తెలిపింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కల దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.