మనసున్న మారాజు ఈ పోలీస్. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఏకంగా స్వీపర్ గా పని చేసే వ్యక్తికి ఒక కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఎంత మంచి మనసో (మనిషో) కదా.. ఈరోజుల్లో మనిషి గురించి ఆలోచించే మనుషులు కూడా ఉన్నారాకే, అది కూడా పోలీసులు. దానికి నిదర్శనమే ఈ ఎస్సై.
పోలీసులు మంచోళ్ళు కాదు, లంచాలు తీసుకుంటారు అన్న అభిప్రాయం సాధారణంగా చాలా మందిలో ఉంటుంది. అయితే తెలంగాణ పోలీసుల ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రజలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పోలీస్ అంటే ఇలా ఉండాలిరా.. రియల్ హీరో అనిపించుకునేలా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానా విధించకుండా.. ఆ జరిమానా డబ్బుతోనే హెల్మెట్ తెచ్చి ఇచ్చే పోలీసులు ఉన్నారు. కొందరైతే ఉచితంగా హెల్మెట్ లు పంచిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పి వాహనదారులకు దండం పెట్టి మరీ అవగాహన కల్పించే మన కంటే ఎక్కువ బాధ్యత కలిగిన పోలీసులు ఉన్నారు. పబ్లిక్ కోసమే నిరంతరం పని చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కఠినంగా కూడా ఉంటారు.
ఎంత కఠినంగా ఉన్నా కూడా కష్టం చెప్పుకుంటే కన్నీళ్లు కార్చేస్తారు. సాయం కోరి వస్తే వెంటనే చేసి పెడతారు. అలాంటి వారిలో వనపర్తి జిల్లా పానగల్ మండల ఎస్సై నాగన్న ఒకరు. స్వీపర్ గా పని చేస్తున్న నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపారు. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదకు ఒక కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో నాగన్న ఎస్సైగా పనిచేస్తున్నారు. 2021వ సంవత్సరంలో పెద్ద కొత్తపల్లి నుంచి బదిలీపై పానగల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు నాగన్న. పలు కేసులను సునాయాసంగా ఛేదిస్తూ.. తోటి పోలీసులకు తన వంతు సాయం అందజేస్తూ అండగా నిలబడుతున్నారు.
ఈయన పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే బాలరాజు అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా స్వీపర్ గా పనిచేస్తున్నారు. బాలరాజు తన ముగ్గురు చెల్లెళ్లను, మతిస్థిమితం లేని తల్లిని, చెల్లెల్ని పోషిస్తున్నారు. జీవితం చాలా ఇబ్బందుల్లో నడుస్తోంది. సొంతంగా ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. అది కూడా వర్షం పడితే ఆ నీరు కారుతుంది. ఎవరి ఆదరణ లేక దిక్కుతోచని స్థితిలో గడుపుతున్న బాలరాజు గురించి తెలుసుకున్న ఎస్సై నాగన్న.. ఆపన్నహస్తం అందించారు. మతిస్థిమితం లేని బాలరాజు కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్నారు. వారి కోసం ఒక చిన్న ఇంటిని కట్టించారు. పాత ఇంటిలో దయనీయ స్థితిలో ఉండడం చూసి చలించిపోయిన ఎస్సై నాగన్న కొంత డబ్బు వేసుకుని.. మిగతా కొంతమంది దాతలతో కలిసి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు.
నూతన గృహ ప్రవేశానికి డీఎస్పీ ఆనంద్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా గృహ ప్రవేశం చేయించి.. బాలరాజు కుటుంబానికి ఇంటి తాళాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగన్నను స్థానికులు, డీఎస్పీ ఆనంద్ రెడ్డి ప్రశంసించారు. బాలరాజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని, ఆయన ఉంటున్న ఇల్లు కూడా బాగోలేదని తోటి పోలీసులు చెప్తే చలించిపోయిన ఎస్సై నాగన్న.. వెంటనే బాలరాజు ఇంటికి వెళ్లి పరిస్థితులను గమనించి ఇంటిని ప్రారంభించారు. మరి బాలరాజు కుటుంబంలో వెలుగులు నింపిన హీరో ఎస్సై నాగన్న గారికి ఒక సెల్యూట్ చేయండి.