ప్రజా గాయకుడు, ప్రజా కవి, విప్లవ వీరుడు తెలంగాన ప్రజల గుండె చప్పుడు గద్దర్ నిన్న హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రజలకు యుద్ద నౌక, ప్రజా గాయకుడు గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భూమి కోసం.. భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం.. అణగారిన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తన గళంతో ఉద్యమ స్పూర్తినందించిన గొప్ప గాయకుడు. తెలంగాణ సాధనలో, ఇక్కడి ప్రజల చైతన్యంలో ప్రజా గాయకుడు గద్దర్ పాత్ర మరువలేనిది. ఇందుకే గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ సమాజం విషాదంలో మునిగిపోయింది. పాటకి గజ్జె కట్టి.. ప్రజల గుండెల్లో దాని అలజడి మోగించి.., కార్షిక, కార్మిక, బీద వర్గాలకి అండగా నిలిచిన ఆయన చివరిచూపు కోసం జన సందోహం కదిలి వచ్చింది. ఇక ఈ సాయంత్రం అల్వాల్‌లోని మహాబోధి స్కూల్లో గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.
ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్‌లోని మహాబోధి స్కూలు వరకు అంతిమయాత్ర సాగింది. ఇందులో అన్నీ రంగాల ప్రముఖులు, సామాన్యులు పాల్గొని గద్దర్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే.., ఓ ప్రజా కవి అంతిమయాత్రకి ఇన్ని వేల మంది ప్రజలు కదిలి వస్తారని అధికారులు ముందుగా అనుకోకపోయినా.. అన్నీ ఏర్పాట్లు బాగానే చేశారు. కానీ.., గద్దర్ చివరిచూపు కోసం ఊహించని స్థాయిలో జనం రావడంతో వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఒక్కసారిగా మంది ఎక్కువ కావడంతో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందటం విషాదం. ఇక పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే.. చనిపోయిన వ్యక్తి గద్దర్ అభిమాని, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గా గుర్తించారు.