గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ పలువురు నేతలను కలుస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తన పార్టీ పోటీ చేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు పలు గ్రామాలు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అయ్యారు. సమావేశం పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో పలు విషయాలపై చర్చించినట్లు ఆయన అన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ దారుణమైన పాలన కొనసాగిస్తున్నారని.. ఇంత అవనీతి పాలన తాను ఎక్కడా చూడలేదని అన్నారు. త్వరలో తాను 33 జిల్లాలు పర్యటిస్తానని.. కేసీఆర్ దుష్ట పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తానని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఈసారి లక్షలు ఖర్చు పెట్టినా ముప్పై సీట్ల కన్నా ఎక్కువ గెలవలేడు అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు ప్రత్యమ్నాయంగా ఎవరు లేరని అందుకే ప్రజాశాంతి పార్టీ తరపున తాను ఉండనున్నట్లు వెల్లడించారు.
దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ఇప్పటికే ఢిల్లీలో మాయావతి, మమత బెనర్జీ, అకిలేష్ యాదవ్‌లతో సమావేశం అయ్యానని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన, కుల పాలనను అంతం చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. ఇక ఏపీ గురించి మాట్లాడుతూ.. ఏపీ అంధకారంలోకి వెళ్లిందని అన్నారు. మరో ఇరవై ఏళ్లు గడిచినా అప్పులు తీరవని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజలు మీతో ఉన్నారని గవర్నర్ తమిళిసైతో చెప్పినట్లు పాల్ తెలిపారు.
#Telangana Governor Tamilisai Soundararajan meets evangelist KA Paul. Caption? pic.twitter.com/Hlx3AEVm2t
— Rishika Sadam (@RishikaSadam) April 13, 2022