ప్రపంచం టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్నా గానీ.. కొందరు మాత్రం వారి మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. మూఢనమ్మకాల పేరుతో దేశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన సంఘటన గురించి చెబితే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఈ ఘటన అచ్చం హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో దొంగ బాబా వేషం వేసుకుని వచ్చి.. దోచుకెళ్లిన సీన్ లా ఉంటుంది. మీ ఇంటికి నరదిష్టి ఉందని చెప్పి ఇంట్లోకి వచ్చాడు ఓ దొంగ బాబా. ఆ తర్వాత తన ఫెర్పామెన్స్ ను చూపించాడు సదరు దొంగ బాబా.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, ఎల్బీనగర్ లోని ఇంద్రప్రస్థ కాలనీలో తిరుగుతున్నాడు ఓ దొంగ బాబా. ఆ ప్రాంతంలో మహిళలు ఒంటరిగా ఉండే ఇళ్లపై ప్రత్యేక నిఘా పెట్టేవాడు. ఈ క్రమంలోనే ఇంద్రప్రస్థ కాలనీలో ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు దొంగ బాబా. ఇదే అదునుగా భావించి.. ఆ ఇంటి దగ్గరికి వెళ్లి.. మీ ఇంటికి నరదిష్టి ఉంది, పూజలు చేయాలని మాయమాటలు చెప్పాడు. దాంతో ఆ స్వామీజీ మాటలకు బయపడిపోయిన ఆ మహిళ అతడిని ఇంటిలోకి తీసుకెళ్లింది. అనంతరం తాను శ్రీశైలం నుంచి వస్తున్నానని కట్టు కథలు అల్లాడు. ఈ క్రమంలోనే ఇంటికి నరదిష్టి పోవడానికి కొన్ని పూజలు చెయ్యాలని చెప్పాడు. అలాగే అని సదరు మహిళ చెప్పడంతో.. పూజ చేసే క్రమంలోనే తనతో తెచ్చుకున్న మత్తుమందును ఆమె ముఖంపై చల్లాడు.
అనంతరం ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత మెడలో ఉన్న మంగళసూత్రంతో ఊడాయించాడు ఆ దొంగ బాబా. మత్తు నుంచి కోలుకున్న మహిళ.. తన మెడలో మంగళ సూత్రం లేకపోవడాన్ని గమనించింది. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దొంగను కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. అతడి నుంచి మంగళ సూత్రాన్ని రికవరీ చేసి మహిళకు అప్పగించారు. రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్నప్పటికీ ఇలాంటి దొంగ బాబాలను నమ్మేవారు సమాజంలో ఇంకా ఉండటం శోచనీయమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.