టాలీవుడ్ ఇండస్ట్రీలో డిసెంబర్ నుండి థియేటర్స్ వద్ద భారీ చిత్రాల సందడి మొదలుకానుంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలకు రెడీ అవుతున్నాయి. దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి. అయితే రిలీజ్ కాబోతున్న భారీ చిత్రాలకు తీపి కబురు అందించింది హైకోర్టు. త్వరలో రానున్న పుష్ప, ఆర్ఆర్ఆర్,రాధేశ్యామ్, భీమ్లానాయక్ లాంటి బిగ్ బడ్జెట్ చిత్రాలు తమ టికెట్ ధరను 50 రూపాయలు వరకు పెంచుకునేందుకు అనుమతినిస్తూ హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది.
హైకోర్ట్ అందించిన తీర్పుతో బిగ్ బడ్జెట్ చిత్రాలకు ఊరట కలిగిందని చెప్పాలి. టికెట్ రేట్లకు సంబంధించి థియేటర్స్ యాజమాన్యం వేసినటువంటి పిటిషన్స్ పై జస్టిస్ విజయసేన్ రెడ్డి జడ్జిగా వ్యవహరించారు. అన్ని తరగతుల టికెట్ ధరలను కనీసం 50 శాతం మేరా పెంచాలని న్యాయస్థానం ముందు మల్టీప్లెక్స్ లు, థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. అభ్యర్థనలు విన్న న్యాయస్థానం థియేటర్లకు ఒక్కో టికెట్ పై 50 రూపాయలు అదనంగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ అనుమతించింది. అలాగే థియేటర్స్ వారు ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అటు పోలీసు శాఖను ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
టికెట్ రేట్స్ పెంపు పై పోలీసు వారిని లేదా ప్రభుత్వాన్ని ఆశ్రయించి దరఖాస్తు చేసుకున్న థియేటర్లకు మాత్రమే కోర్టు ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో థియేటర్స్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేసాయి. ఇకపై రాబోవు చిత్రాలకు కలెక్షన్స్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి టాలీవుడ్ ఇండస్ట్రీ సంక్రాంతికి ఎన్ని కోట్లు బిజినెస్ నమోదు చేస్తుందో..!