‘కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు” అంటారు పెద్దలు. అదీ కాక చేసిన సాయాన్ని చెప్పుకుంటే పుణ్యం కూడా రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. “చేసిన దానంలో సాయం కనిపించాలి కానీ.. మనిషి కాదు” అన్న నానుడి కూడ ఉండనే ఉంది. ఇక సాయం పేరుతో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి చీప్ పబ్లిసిటీ చేస్తున్నాడని మండి పడ్డాడు తెలంగాణ గోల్డ్ మాన్ గా పేరొందిన దర్గా చిన్న పహిల్వాన్. అసలు హర్ష సాయి అంటే ఎవరో కూడా తనకు తెలిదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయిపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
హర్ష సాయి.. యూట్యూబ్ సంచలనం.. చేసింది 110 వీడియోలే అయినప్పటికీ 7.29 మిలియన్ సబ్ స్క్రైబర్స్ తో య్యూట్యూబ్ స్టార్ గా మారిపోయాడు. ఇక హర్ష సాయికి చిన్న పాటి స్టార్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. పేదవారి కలలు సాకారం చేయడంలోనే నాకు ఆనందం ఉందంటూ పలు మార్లు హర్ష సాయి చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే చాలా మంది పేదవారికి తన వంతుగా సాయం చేస్తున్నాడు. ఫ్రీ పెట్రోల్ బంక్, పేదలకు ఫైవ్ స్టార్ హోటల్లో బస, బార్బర్ ను మిలియనీర్ చేయడం లాంటి వీడియోలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే ఇతడిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. పేదలకు గోరతం ఇచ్చి.. య్యూట్యూబ్ వీడియోలతో కొండంత ఆదాయం సంపాదిస్తున్నాడని.
ఈ నేపథ్యంలోనే మరోసారి విమర్శలు ఎదుర్కొని వార్తల్లో నిలిచాడు హర్ష సాయి. ఈ సారి అతడిపై మండిపడ్డ వ్యక్తి ఆశామాషీ వ్యక్తి కాదు.. తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా పేరొందిన దర్గా చిన్న పహిల్వాన్.. మెడనిండా బంగారు గొలుసులు, చేతి వేళ్లకు బంగారు ఉంగరాలు, అసలు ఈ పహిల్వాన్ నడుచుకుంటూ వస్తుంటే.. ఓ గోల్డ్ షాపే రోడ్డు మీద నడుస్తుందా? అన్న అనుమానం వస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న పహిల్వాన్.. హర్ష సాయిపై మండిపడ్డాడు. అతడు హర్ష సాయి గురించి మాట్లాడుతూ..”అసలు మనం సాయం చేస్తే మనకు తప్ప, ఇంకెవరికీ తెల్వొద్దు. 5,10 వేలు సాయం చేసి లైక్ చేయండి.. సబ్ స్క్రైబ్ చేయండి అని అగడం కరెక్ట్ కాదు. ఇదంతా చీప్ పబ్లిసిటీ.. చీప్ మెంటాలిటీ. ఇది పాపం యూత్ కు తెలియక ధాం..ధూం.. అంటూ అతడి చుట్టు తిరుగుతున్నారు”అని అన్నాడు.
ఇక యాంకర్ మీకు హర్ష సాయి ఎవరో తెలుసా? అని అడగ్గా..”నాకు ఆడు ఎవడో తెలీదు.. ఇప్పటి వరకు వాడ్ని చూడలేదు. మా పోరగాళ్లు చాలా మందే వాడిని చూశారు. కానీ నాకైతే తెల్వది. ఆటోలో ఎక్కుతాడు.. వాడికి 5 వేలు ఇస్తాడు.. దాన్ని వీడియోగా తీసి పోస్ట్ చేస్తాడు. అది నీచమైన పని.. అలా చేయకూడదు. ఇప్పుడు చిరంజీవి ఉన్నారు.. ఆయన కొన్ని వందల కోట్లు దానం చేశారు. కానీ ఎప్పుడు ఇలా చెప్పుకోలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా దానాలు చేశారు. వాళ్లెప్పుడు ఇలా చెప్పుకోలేదు.. ఈ యూత్ పిల్లలకు తెలియక హర్ష సాయి.. హర్ష సాయి.. అని అతని వెనక తీరుగుతున్నారు” అని చెప్పుకొచ్చాడు. అయితే హర్ష సాయి మాత్రం ఆ వీడియోల ద్వార వచ్చిన డబ్బులను మళ్లీ పేదలకే వినియోగిస్తున్నానని చాలా సార్లే చెప్పాడు. మరి చిన్న పహిల్వాన్ చేసిన వ్యాఖ్యలపై హర్ష సాయి అభిమానులు, హర్ష సాయి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.