ఎండకాలం ఎండలు మండిపోతాయి.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో ఎండ వేడిమి వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
ఇటీవల హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో భయాంతోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘట తర్వాత పలు చోట్ల అగ్రి ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్.. బాలాపూర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాకపోతే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ లో ఓ స్కూల్ వెనుక ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ బీహార్, చత్తీస్ గఢ్ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు గత నాలుగు సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. శుక్రవారం రోజున కార్మికులు తమ పనుల కోసం బయటకు వెళ్లారు. 11 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి గుడిసెల నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. అంతలోనే పక్క గుడిసెలకు నిప్పంటుకొని పెద్ద ఎత్తన మంటలు విస్తరించాయి.
గుడిసెలకు నిప్పంటుకోవడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఆ సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ఒక గుడిసెలో పొయ్యి మీద వంట చేసి నిప్పులు ఆర్పడం మర్చిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్ లో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. నగరంలోని అగ్ని మాపక నిబంధనలు పాటించని ఆసుపత్రులు, మాల్స్ కి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.