మేలో ఎండలు మండుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలు పడి వాతావరణం కాస్త చల్లబడినా.. ప్రస్తుతం భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలంలో తరుచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పలు చోట్ల గ్యాస్ లీక్ కావడం, సిలిండర్లు పేలిపోతుంటాయి.
ఈ మద్య ప్రమాదాలు ఎటునుంచి ముంచుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్తితి నెలకొంది. నిన్న పాతబస్తీలో ఓ ఆటో సిలిండర్ల లోడ్ తో వెళ్తుంది. అందులో ఓ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఆటో డ్రైవర్ తో సహా.. అటుగా వస్తున్న జనాలు భయంతో రోడ్డుపైనే వాహనాలు వదిలివేసి పరుగులు తీశారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా హైద్రాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల హైదరాబాద్ లో పలు చోట్ల గ్యాస్ సిలిండర్లు పేలిపోతున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. హైద్రాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో బుధవారం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. మైలార్‌దేవ్ పల్లిలో దుర్గానగర్ వద్ద రవిరంజన్ కుమార్ నివాసముంటున్నాడు. ఈ రోజు ఆయన ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలింది.. దీని ప్రభావంతో ఇల్లు కుప్పకూలిపోయింది. అదృష్టం కొద్ది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.