KCR: ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, ప్రజలను గాలికి వదిలేస్తున్నారని, తమకిష్టం వచ్చిన వారికి, కోటీశ్వరులకు, వ్యాపారులకు దేశ సంపదను దోచిపెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజారాజ్యం.. రైతుల రాజ్యం రావాలని, ఈ దేశం కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ కోసం కులం మతం అన్న తేడా లేకుండా.. ఆ వర్గం ఈ వర్గం అన్న తేడా లేకుండా 58 ఏళ్లు మనం పోరాడాం. తెలంగాణ తెచ్చుకున్నాం.
ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్లు వర్తించాయి. ఈ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఏడేళ్ల కిందట కేంద్రానికి పంపాం. ఆ బిల్లును ఎందుకు ఆపుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా. మోదీ పుట్టినరోజున చేతులు జోడించి అడుగుతున్నా. బిల్లుకు రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించండి. రిజర్వేషన్లు వెంటనే పెంచాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. మా న్యాయమైన హక్కునే మేం అడుగుతున్నాం. పోడు రైతులకు ఇచ్చేందుకు భూములు గుర్తించాం. పోడు భూములు రైతులకు ఇచ్చి రైతు బంధు కూడా ఇస్తాం. అంతేకాదు! గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వారం రోజుల్లో జీవో ఇస్తాం. మోదీ.. మా జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా?. గిరిజన గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతాం.
సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం. దళిత బంధులాగే.. గిరిజన బంధు కూడా ప్రారంభిస్తామని హామీ ఇస్తున్నా. ఏడేళ్ల క్రితం కరెంట్ పరిస్థితి ఎలా ఉండింది. ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు కష్టపడ్డాం.. చేసుకున్నాం. దాన్ని బతకనీయకుండా.. ప్రతీ బోరుకు మీటర్ పెట్టాలని, ముక్కు పిండి డబ్బులు వసూలు చేయాలని నరేంద్ర మోదీ చూస్తున్నారు. పెట్టాల్నా బాయి కాడ బోరు?.. కూడదు. ఇదీ పరిస్థితి. సులభంగా పరిష్కారం చేసే విషయాల్లో తాచ్చారం చేస్తున్నారు. దేశాన్ని ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. తమకిష్టం వచ్చిన వారికి, కోటీశ్వరులకు, వ్యాపారులకు దేశ సంపదను దోచిపెడుతున్నారు. ప్రైవేటైజేషన్ పేరిట లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారు.
ఈ దుర్మార్గం పోవాలే.. ప్రజారాజ్యం రావాలి. రైతుల రాజ్యం రావాలి. ఈ దేశం కొత్త పుంతలు తొక్కాలి. నదులల్లోని నీరు సముద్రం పాలు కాకుండా రైతుల పొలాల్లోకి రావాలి. తెలంగాణలో జరిగే ప్రయత్నమే భారతదేశం మొత్తం జరగాలి. ఇది జరగాలంటే మనం కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలి. రాష్ట్రం కోసం పోరాటం చేసినట్లు దేశం కోసం కూడా పోరాటం చేయాలి. మహాత్ముడు సాధించిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అది మన కర్తవ్యం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మళ్లీ కల్లోలానికి గురికావద్దు’’ అని అన్నారు. మరి, మోదీ తమకిష్టం వచ్చిన వారికి, కోటీశ్వరులకు, వ్యాపారులకు దేశ సంపదను దోచిపెడుతున్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.