ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ టైమింగ్స్ లో మార్పులు చేయాలని పలువురు విద్యాశాఖను కోరుతున్నారు. దీంతో పని వేళలలో మార్పులు తీసుకొచ్చే దిశగా విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిపుణులు, ఇతర వర్గాల వారు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
విద్యార్థులు విద్యాబుద్దులు నేర్చుకుని భావి భారత పౌరులుగా రూపుదిద్దుకునేది పాఠశాలల్లోనే. చదువు ద్వారానే సాధారణ వ్యక్తి మహోన్నతమైన వ్యక్తిగా తయారవుతాడు. ఇటీవల వచ్చిన సార్ సినిమాలో కూడా చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యతోనే గౌరవం, హోదా దక్కుతాయని ఆ సినిమాలో చూపించారు. ప్రస్తుత రోజుల్లో ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత పెరిగింది. ఎంతటి పేదరికంలో ఉన్నా కూడా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే తాజాగా కొంత మంది ప్రజా ప్రతినిధులు స్కూల్ టైమింగ్స్ ను మార్చాలని విద్యాశాఖను కోరినట్లు తెలిసింది. పాఠశాల పనివేళల మార్పుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పాఠశాల పనివేళలను మార్చాలని వస్తున్న వినతుల దృష్ట్యా దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రైమరీ పాఠశాలలు, సెకండరీ పాఠశాలలో స్కూల్ టైమింగ్స్ మార్చాలని పలువురు కోరుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. హైస్కూల్స్ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పనిచేస్తున్నాయి. అయితే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఉదయం త్వరగా నిద్ర లేవరు కాబట్టి ఉదయం 9:30 గంటలకు స్కూల్ ప్రారంభించాలని, హైస్కూల్ విద్యార్థులు కాస్త పెద్ద వారు కాబట్టి వారికి ఉదయం 9 గంటల నుంచి పాఠశాల ప్రారంభించాలని కోరారు. ఇక ఇదే విషయంపై భిన్న వాధనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రైమరీ స్కూల్స్ టైమింగ్ మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు.
గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు చేసుకునే వారు ఉంటారు. కాబట్టి వారి పిల్లలను త్వరగా స్కూల్ కు పంపించి వారు పనులకు వెళ్లిపోతారు. కానీ టైమింగ్ మార్చడం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ వారు ఉదయం ఏడు గంటల నుంచే పిల్లలను స్కూల్ వ్యాన్ లలో తరలిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక హైస్కూల్స్ లో విద్యార్థులు పొరుగు ఊళ్ల నుంచి వస్తారు కాబట్టి అరగంట ముందుకు జరపకుండా ఆలస్యంగానే పాఠశాలలు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. ఆ అంశాలన్నింటిని పరిశీలించి, నిపుణుల సలహాలు తీసుకుని స్కూల్ టైమింగ్స్ మార్పులపై నిర్ణయం తీసుకోవాలని పలువురు విద్యాశాఖను కోరుతున్నారు. ఇక దీనిపై విద్యాశాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.