ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒక్కసారే సికింద్రాబాద్ అల్లర్లు అలజడి రేపాయి. అయితే సికింద్రాబాద్ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుబ్బారావు ని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సుబ్బారావుతో పాటు ఆయన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్ అల్లర్లకు ముఖ్యకారణం రూ.45 కోట్ల వ్యవహారం అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఇతరుల నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల తాను నష్టాల్లో కూరుకుపోతానని.. భయంతో సుబ్బారావు పెద్ద కుట్రకు పథకం వేశాడు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కేంద్రం ‘అగ్నీపథ్’ పథకాన్ని ఉపసంహరిస్తుందని భావించాడు. ఇక 2014లో సాయిడిఫెన్స్ అకాడమీ ప్రారంభించిన సుబ్బారావు.. ఎక్కడ ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుంటే అక్కడకు వెళ్లి ఆర్మీ అభ్యర్ధుల వివరాలు తీసుకునేవాడు.
అలా వివరాలు తీసుకొని వారికి కోచింగ్ సెంటర్ లో చేరమని చెప్పేవాడు. కోచింగ్ తీసుకొని ఆర్మీలో సెలక్షన్ అయితే వారి వద్ద నుంచి మూడు లక్షలు తీసుకునేవాడు. ఈ విధంగా రిక్రూట్ మెంట్ సాగుతున్న అభ్యర్థుల నుంచి సుబ్బారావుకి దాదాపు రూ.45 కోట్ల వరకు రావాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే కేంద్రం అగ్నిపథ్ పథకం ప్రవేశ పెట్టిందో తాను కోట్లల్లో మునిగిపోతానని భావించాడు తీవ్ర ఆందోళన చెందాడు సుబ్బారావు.
ఈ నేపథ్యంలోనే కొంత మంది ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం ఉన్న స్టూడెంట్స్ ని తన మాయమాటలతో రెచ్చగొట్టాడు. ఎనిమిది వాట్సాప్ గ్రూపుల్లో పలువుర్ని సభ్యులుగా చేర్చాడు. బీహార్ మాదిరిగా రైళ్లను తగలబెట్టాలని వాట్సప్ గ్రూపుల్లో విద్యార్థులకు సూచించనట్టు పోలీసులు తెలిపారు. సుబ్బారావుపై 26 కేసులు నమోదయ్యాయి. కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.