కల్తీ వ్యాపారం తాచు పాములా బుసలు కొడుతూ కోరలు చాస్తోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు కొంతమంది నీటి దగ్గరినుంచి మొదలుకుని అనారోగ్యం వచ్చినపుడు వేసుకునే మందుల వరకు అన్నిటిని కల్తీ చేసి పడేస్తున్నారు. అంగట్లో ఏది కొనాలన్నా ప్రాణాల మీద ఆశలు వదులుకుని కొనాల్సిన పరిస్థితి. పల్లెటూళ్ల సంగతి పక్కన బెడితే.. పట్టణాలు, నగరాల్లో కల్తీ సమస్య పెచ్చు మీరి విలయతాండవం చేస్తోంది. అక్రమార్కులు ప్రతీ వస్తువును కల్తీ చేసి పడేస్తున్నారు. గజిబిజి బతుకులతో కాంక్రిట్ జంగిల్‌లో జీవిస్తున్న వారి పాలిట ఇది శాపంగా మారుతోంది. అనారోగ్యాల మీద అనారోగ్యాలను తెచ్చిపెడుతోంది. నూటికి 90 శాతం మంది తమకు తెలియకుండానే నిత్య జీవితంలో కల్తీ వస్తువులను వాడి అనారోగ్యం పాలవుతున్నారు. డబ్బున్న వారి సంగతి పక్కన పెడితే..
మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి బతుకుల రెక్కల కష్టం మొత్తం ఆసుపత్రుల పాలవుతోంది. ప్రజా ఆరోగ్యం గురించి కొంచెం కూడా పట్టని దుర్మార్గులు కల్తీని విచ్చల విడిగా కొనసాగిస్తున్నారు. కఠిన చర్యలు, జైలు శిక్షలు ఉన్నా కూడా భయపడటం లేదు. చిన్న చిన్న సందుల్ని, ఊరి చివరి ఇళ్లను అడ్డాగా చేసుకుని కల్తీ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా, కల్తీ పాల దందా ఒకటి బయట పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు వ్యక్తులు కొన్ని పాలు, ఎక్కువ రసాయనాలతో వందల కొద్ది లీటర్ల పాలను తయారు చేసి నగరంలో విక్రయిస్తూ పట్టుబడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బాల నర్సయ్య, భాస్కర్, నకిరేకంటి రాజు అనే వ్యక్తులు బీఎన్ తిమ్మాపూర్ గ్రామం అడ్డాగా కల్తీ దందా మొదలుపెట్టారు.
వీరు చుట్టు పక్కలి గ్రామాలనుంచి కొన్ని లీటర్ల పాలను కొనుక్కుంటున్నారు. ఆ పాలకు నీళ్లు, తెలుపు రంగు వచ్చేందుకు పాల పొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. ప్రతీ రోజూ దాదాపు 300 లీటర్ల కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ఈ పాలను హైదరాబాద్‌లోని పలు కాలనీలు, స్వీట్ హౌస్‌లు, హోటళ్లకు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు కల్తీ దందా నిర్వహిస్తున్న నిందితుడి ఇంటిపై దాడి చేశారు. అతడి వద్ద నుంచి 120 లీటర్ల పాలు, రసాయనాలను స్వాధీనం పర్చుకున్నారు. మిగిలిన వారికోసం అన్వేషిస్తున్నారు. మరి, ఈ కల్తీ పాల దందాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.