వైద్యో నారాయణో హరి: అన్నారు పెద్దలు. ఎందుకంటే దేహం అందమైనదే కాదూ రోగాలు పాలైనప్పుడు అంధవిహీనంగా కనిపిస్తుంది. రోగాల బారిన పడినప్పుడు ఇంట్లో వాళ్లు సైతం మనల్ని ముట్టుకునేందుకు సంకోచిస్తారు. కానీ ఎంతటి రోగమొచ్చినా మనకు చికిత్స అందిస్తారు వైద్యులు. అందుకే వారిని దేవునితో కొలుస్తూ వైద్యో నారాయణో హరి అన్నారు. కానీ ఇప్పుడు వైద్యం చాలా ఖరీదై పోయింది. ఫీజుల దగ్గర నుండి మెడిసన్ల వరకు ఓ రకమైన దందా నడుస్తుందని చెప్పవచ్చు. చిన్న జలుబు వచ్చి వైద్యుడి దగ్గరకు వెళితే రూ. 500 నోటు చదివించుకోవాల్సిందే. ఏదైనా పెద్ద జబ్బు చేస్తే ధనవంతులు తప్ప, మధ్య తరగతి ప్రజలు వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఇక నిరుపేద ప్రజల సంగతి చెప్పనక్కర్లేదు. వీరికి మామూలు వైద్యం కూడా అందని ద్రాక్షే.
ఇటువంటి వారి కోసమే కేవలం పదిరూపాయాలకే వైద్యం అందించే ఆసుప్రతిని ప్రారంభించారో వైద్యుడు. ఇది ఎక్కడునుకుంటున్నారా.. హైదరాబాద్‌లోనేనండి. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో ఈ దవాఖానాను ఏర్పాటు చేశారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ పేరుతో డా. కోనేరు సత్యప్రసాద్ నెలకొల్పారు. సోమవారం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, పోలీసు అదనపు కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. పీడియాట్రిక్, డెర్మటాలజీ, ఫ్యామిలీ మెడిసిన్‌తో పాటు 10 రకాల వైద్య సేవలను అందిస్తామని సత్యప్రసాద్ తెలిపారు.
వచ్చే నెల 22 నుండి వైద్యులు అందుబాటులో ఉంటారని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా రూ. 10కే నాణ్యమైన వైద్యం అందిస్తామన్నారు. కాగా, ఈ సంస్థ స్థాపించడం పట్ల నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, కమిషన్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ మాజీ డైరెక్టర్ డా.మణిమాల, డా. గీతిక, సబితా దేవి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైద్యం ఖరీదైన ఈ సమయంలో ఇలా 10 రూపాయలకే వైద్య అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.