దేశంలో ఇంకా అనేక గ్రామాల్లో చీకటిలో మగ్గుతున్నాయి. అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో ఉండిపోతాయి. అలాంటి గ్రామాలకు రోడ్డు, రవాణా మార్గం ఉండదు. కాలి నడక ద్వారానే వారి గ్రామాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కనీస సదుపాయాలు లేని గ్రామాలెన్నో. అయితే ఓ పసిపాప కడుపునింపేందుకు ఓ కుగ్రామంలోని ఓ కుటుంబం నానా కష్టాలు పడుతూ వార్తల్లో నిలిచింది.
శాస్ర్ర్ర సాంకేతికంగా దేశం ఎంత ముందుకు దూసుకు వెళుతున్నా.. ఇంకా అనేక గ్రామాల్లో చీకటిలో మగ్గుతున్నాయి. అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో ఉండిపోతాయి. అలాంటి గ్రామాలకు రోడ్డు, రవాణా మార్గం ఉండదు. కాలి నడక ద్వారానే వారి గ్రామాలకు చేరుకోవాల్సి ఉంటుంది. విద్య, వైద్యం గురించి ఇక చెప్పనవసరం లేదు. కనీసం సరైన సదుపాయాలు కూడా ఉండవు. ప్రభుత్వాలకు విన్నవించినా..పట్టించుకోకపోవడంతో అలాగే జీవనం సాగిస్తుంటారు. అటువంటి గ్రామాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. రోడ్డు, రవాణా మార్గం లేక.. ఓ పసిబిడ్డ పాల కోసం ఇంటిల్లిపాదీ ముప్పతిప్పలు పడుతున్నారు. మనం చెప్పుకునే ఓ గ్రామం తెలంగాణలో ఉంది. ఆ కుటుంబం ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని రాజుగూడకు చెందిన కొడప పారుబాయి.. ఈ ఏడాది జనవరిలో ఇంద్రవెల్లి ప్రభుత్వాసుపత్రిలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేయడంతో కుటుంబ సభ్యులు పసి బిడ్డతో పాటు పారుబాయిని గూడానికి తీసుకు వచ్చారు. అయితే కేవలం పది రోజులకే తల్లి పారు బాయి అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. దీంతో పసికందుకు పాలు కరువయ్యాయి. అయితే ఆ పసిబిడ్డ కడుపు నింపేందుకు పారుబాయి తండ్రి జంగుబాబుతో పాటు తాత బాపురావు పడరాని పడుతున్నాడు. ఆ గూడెంలో కనీసం పశువులు కూడా లేకపోవడంతో పాపకు పాల కోసం ఇద్దరు రానూ పోను 20 కిలో మీటర్లు వెళుతున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ప్రతి రోజు గూడెం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిద్దరి ఖానాపూర్ కాలినడకన వెళతారు.
అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లికి వాహనాల్లో వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొస్తున్నారు. పశువులతో పాటు అక్కడ దుకాణాలు కూడా సరిగా లేకపోవడంతో పాల కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి.. పాలు తీసుకు వచ్చి ఆ పసిదాన్ని కడుపు నింపుతున్నారు. అయితే పాల కోసం తాము పడుతున్న కష్టాన్ని గుర్తించి, పసిపాప కడుపు నింపేందుకైనా ఆవును మంజూరు చేయాలని ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో నెల రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నారు ఈ కుటుంబం. కానీ.. ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. దీంతో ఆ పసిపాప ఆకలి తీర్చడానికి కుటుంబసభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజు పాల కోసం కిలోమీటర్లు మేర ప్రయాణించి.. వాటిని తీసుకు వచ్చి.. పసిపాపకు అందిస్తున్నారు.