‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో టీమిండియా మొదట్లో తడబడినా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. గ్రూప్ 2లో పాకిస్తాన్ ఇప్పటికే సెమీస్ చేరింది. రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్థాన్ లు పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రేసులో ఉన్న అన్ని జట్లకు పాయింట్ల తర్వాత ఎంతో కీలకమైనది నెట్ రన్ రేట్. వేరు వేరు జట్లకు ఒకే పాయింట్లు వచ్చుంటే.. అప్పుడు నెట్ రన్ రేట్ ను బేస్ చేసుకుని ఏ జట్టు సెమీస్ చేరుతుందో నిర్ణయిస్తారు. అంటే అర్హత సాధించడంలో నెట్ రన్ రేట్ కూడా ఎంతో కీలంకంగా మారుతుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు అందరి నోట నెట్ రన్ రేట్ పదమే వినిపిస్తోంది. మరి నెట్ రన్ రేట్ అంటే ఏంటి? దానిని ఎలా కాలుక్యులేట్ చేస్తారు? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఒక మ్యాచ్ లో ఆడిన రెండు టీమ్ లకు నెట్ రన్ రేట్ వస్తుంది. గెలిచిన వాళ్లకు ప్లస్ వస్తే.. ఓడిన వాళ్లకు అదే రన్ రేట్ మైనస్ అవుతుంది. నెట్ రన్ రేట్ ట్రై సిరీస్, వన్డే టోర్నమెంట్లలో పాయింట్లు టై అయిన సమయంలో కీలకంగా మారుతుంది. రెండు లేదా మూడు టీమ్ లకు ఒకే పాయింట్లు ఉంటే వారి నెట్ రన్ రేట్ ఆధారంగా ఏ జట్టు ముందుకు కొనసాగేది నిర్ణయిస్తారు.
ఒక మ్యాచ్ లో నెట్ రన్ రేట్ ను లెక్కించాలంటే ఒక సింపుల్ ఫార్ములాను ఉపయోగిస్తారు. అది మ్యాచ్ లో ఆ జట్టు చేసిన యావరేజ్ రన్స్ పర్ ఓవర్ మైనస్(-) ఆ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టుకు ఓవర్ కు ఎన్ని పరుగులు ఇచ్చింది. ఆ వ్యత్యాసమే నెట్ రన్ రేట్ అవుతుంది. ఉదాహరణకు: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నెట్ రన్ రేట్ ను ఒకసారి కాలుక్యూలేట్ చేద్దాం.
నెట్ రన్ రేట్= 151/20 – 152/17.8 = (+/-)0.989
(ఈ ఫార్ములాలో ఒక బంతి వాల్యూ 0.16. పాకిస్తాన్ 17.5 ఓవర్లలో మ్యాచ్ ముగించింది. అంటే 5 బంతులకు 0.8 వాల్యూ వస్తుంది.)
ఆ మ్యాచ్ లో టీమిండియానెట్ రన్ రేట్ -0.989, పాకిస్తాన్ నెట్ రన్ రేట్ +0.989 వస్తుంది. ఒక మ్యాచ్‌కి అయితే ఇలా లెక్కిస్తారు. అదే ఒక టోర్నమెంట్ మొత్తం ఒక టీమ్ నెట్ రన్ రేట్ లెక్కించాలంటే కొంచం ఫార్ములా మారుతుంది.
ఒక టోర్నమెంట్ మొత్తం జరిగిన మ్యాచ్ లలో ఒక జట్టు నెట్ రన్ రేట్ తెలుసుకోవాలి అంటే.. అన్ని మ్యాచుల్లో వచ్చిన నెట్ రన్ రేట్ ను కూడుతుంటారు. అది తప్పు.. అలా చేస్తే సరైన నెట్ రన్ రేట్ రాదు. అందుకు మరో ఫార్ములా వాడాల్సి ఉంటుంది.
NRR= M1యావరేజ్ స్కోర్+M2యావరేజ్ స్కోర్+M3యావరేజ్ స్కోర్ (-) M1 ఇచ్చిన యావరేజ్ రన్స్+ M2 యావరేజ్ రన్స్+M3 ఇచ్చిన యావరేజ్ రన్స్
ఉదాహరణకు టీమిండియా టోర్నమెంట్ నెట్ రన్ రేట్ చూద్దాం..
151/20+110/20+210/20+89/6.48 – 152/17.8+111/14.5+144/20+85/20 యావరేజ్ రన్స్ పర్ ఓవర్(8.423)- యావరేజ్ రన్స్ కన్ సీడెడ్ పర్ ఓవర్(6.804) = టీమిండియా నెట్ రన్ రేట్(+1.619)
ఈ విధంగా ఏ మ్యాచ్ అయినా లేదా ఏ టోర్నమెంట్ అయినా నెట్ రన్ రేట్ ను లెక్కిస్తారు.
నెట్ రన్ రేట్ లెక్కించే విషయంలో ఎన్ని వికెట్లు కోల్పోయారు.. ఎన్ని వికెట్ల ఆధిక్యంతో మ్యాచ్ గెలిచారు అన్న దానికి ప్రాధాన్యం ఉండదు. ఎన్ని పరుగులు చేశారు. ఎన్ని పరుగులు ఇచ్చారు అనే విషయం మీదనే నెట్ రన్ రేట్ ను లెక్కిస్తారు. కొందరు విమర్శకులు వికెట్లను పరిగణలోకి తీసుకోకపోవడంపై అసహనాన్ని వెల్లిబుచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.