మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఊహకందని ట్విస్టులతో సాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో ఓడి.. సెమీస్ ఆశలే లేని పాకిస్తాన్ ఫైనల్ లో తొలి అడుగు వేస్తే.. పడుతూ లేస్తూ సెమీఫైనల్స్ కు వచ్చిన ఇంగ్లాండ్ మరో అడుగు ముందుకేసింది. ఈ ఇరు జట్లు నవంబర్ 13న అమీ.. తుమీ.. తేల్చుకోనున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. ప్రస్తుత ప్రపంచ కప్ విజేతను కాలమే నిర్ణయించిందా? అంటే నిజమేనేమో అనిపించక మానదు. 1992లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా ఈ ఇరు జట్లు అచ్చం ఇలానే పడుతూ.. లేస్తూ.. వచ్చి ఫైనల్ లో తలపడ్డాయి.
తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాక్.. ఫైనల్ చేరడమేంటి? టోర్నీలో అప్పటిదాకా దుమ్ముదులిపిన కివీస్ సెమీఫైనల్లో దారుణంగా ఓడటమేంటి..? సెమీస్ వరకూ పడుతూ లేస్తూ వచ్చిన ఇంగ్లాండ్ ఫైనల్ చేరడమేంటి..? ఇవన్నీ ఊహకు అందని ప్రశ్నలే. ఏదేమైనా.. ఈ ఇరు జట్లూ ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ లో తలపడటం ఇది రెండోసారి. మొదటిసారి 1992 వన్డే ప్రపంచకప్ లో తొలిసారి ఫైనల్లో తలపడ్డాయి. 30 ఏండ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఫైనల్స్ లో ఆడబోతున్నాయి. వేదిక కూడా అదే మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా). ఈ నేపథ్యంలో అసలు 1992లో ఏం జరిగిందన్నది ఇప్పుడు చూద్దాం.
1992 బెన్సన్ హెడ్జెస్ ప్రపంచ కప్. వేదికలు.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్. పాకిస్తాన్ తొలి మ్యాచులో వెస్టిండీస్ చేతిలో ఓడింది. ఆ తరువాత గ్రూప్ స్టేజ్ లో ఇండియా చేతిలోనూ పరాజయం. ఇంతటితో పాకిస్తాన్ కథ ముగిసిందనుకున్నారు. అయితే.. అనూహ్యంగా తర్వాత మూడు మ్యాచ్ లు గెలిచి ఒక ఎక్స్ట్రా పాయింట్ తో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు సెమీస్ చేరింది. ఆపై సెమీస్ లో న్యూజిలాండ్ ను మట్టికరిపించి ఫైనల్ చేరింది. అప్పుడు ఫైనల్ చేరిన మరో జట్టు ఇంగ్లాండ్.
గతంలో లాగానే ఈ టోర్నీలోనూ పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడింది. తర్వాత జింబాబ్వే పైనా ఇదే ఫలితం. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి సెమీస్ రేసులో నిలిచింది. అయినప్పటికీ వీరికి అవకాశాలు లేవు. అయితే.. అనూహ్యంగా వారికి నెదర్లాండ్స్ రూపంలో అదృష్టం వరించింది. వార్ వన్ సైడ్ అనుకున్న మ్యాచులో సౌతాఫ్రికా పై నెదర్లాండ్స్ నెగ్గడంతో పాక్ సెమీస్ చేరింది. ఇప్పుడు ఇంగ్లాండుతో తలపడనుంది.
ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లు ముగిసేలోపే.. అమీర్ సోహైల్(4), రమీజ్ రాజా(8) రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ ఇంగ్లాడుదే అనుకున్నారు. అయితే.. ఇమ్రాన్ ఖాన్ (72) పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, జావేద్ మియాందాద్ (58), ఇంజమామ్ ఉల్ హక్ (42) విలువైన పరుగులు చేశారు. దీంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు ఇంగ్లాండ్ 49.2 ఓవర్లలో 227 పరుగులకే పరిమితమై 22 పరుగుల తేడాతో ఓటమి పాలవుతుంది. ఈ విజయంతో పాక్, తమ తొలి వన్డే ప్రపంచకప్ ను ముద్దాడింది. ఇప్పుడు కూడా అదే సీన్ మరోసారి రిపీట్ అయ్యేలా ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.