టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. కోహ్లీ, సూర్య కుమార్ లాంటి బ్యాటర్లు దంచి కొడుతుంటే.. బౌలర్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. దీంతో మన జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టేసింది. ఇదే ఊపులో మన వాళ్లు కూడా గట్టిగానే ప్రాక్టీసు చేస్తూ కనిపిస్తున్నారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు అందుకు తగ్గట్లు ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీ.. ఎక్కడ తమ జట్టు గెలుపుని అడ్డుకుంటాడోనని భయపడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మొన్నమొన్నటి వరకు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆసియాకప్ లో సెంచరీ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడింది. ఓడిపోతుంది అనుకున్న ఈ మ్యాచ్ లో కోహ్లీ అద్భుత పోరాటం.. మనకి విజయం దక్కేలా చేసింది. ఆ తర్వాత కూడా మరో రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఈ ఊపులో ఉన్న కోహ్లీ.. ఇంగ్లాండ్ బౌలర్లని ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు.
ఈ క్రమంలోనే కోహ్లీ నెట్ ప్రాక్టీసు చేస్తున్న ఓ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో భాగంగా బంతిని అన్ని వైపులా బాదుతూ కనిపించాడు. దీని దిగువనే కామెంట్ పెట్టిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్సన్.. ‘గురువారం డే ఆఫ్ తీసుకోవచ్చు కదా.. నువ్వంటే నాకు ఎంతిష్టమో నీక్కూడా తెలుసు. కానీ రేపు ఒక్కరోజే విశ్రాంతి తీసుకో ప్లీజ్’ అని సరదాగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. పీటర్సన్ తో కోహ్లీకి మంచి బాండింగ్ ఉంది. ఆ మధ్య విరాట్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టైంలో పీటర్సన్ అతడికి అండగా నిలబడ్డాడు.