మొన్న జరిగిన టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ చూశారా? మీకెలా అనిపించింది అంటే.. క్రికెట్ ప్రేమికులు ఆ ఇన్నింగ్స్ గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే విరాట్ పరుగులు చేయట్లేదు అని గత కొన్నాళ్ల ఒకటే మొరుగుతున్న విమర్శకులకు.. ఒక్క ఇన్నింగ్స్ తో కోహ్లీ నోరు మూయించేశాడు. చూసిన మనకే ఈ రేంజ్ లో రోమాలు నిక్కబొడుచుకుంటే.. ఇక కోహ్లీతో పాటు బ్యాటింగ్ చేసిన వాళ్లకు ఎలా అనిపించి ఉంటుంది.. ఏమైనా ఆలోచించారా? అవును అశ్విన్ అదే విషయం గురించి మాట్లాడాడు. విరాట్ కోహ్లీ.. మన దక్షిణాదిలో బాగా హిట్ అయిన ‘చంద్రముఖి’ క్యారెక్టర్ తో పోల్చాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్-పాక్ మ్యాచ్ ఆదివారం జరిగింది. నరాలు తెగ ఉత్కంఠతో సాగిన ఈ పోరులో మన జట్టే గెలిచింది. టీ20 వరల్డ్ కప్ ని గ్రాండ్ వేలో స్టార్ట్ చేసింది. అయితే కోహ్లీతో పాటు లాస్ట్ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన అశ్విన్.. ఆ సమయంలో ఎలాంటి సిట్చూయేషన్ ఫేస్ చేశాడో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ’45 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి. ఇక కోహ్లీ-హార్దిక్ చెరో 60 పరుగులు చేస్తే తప్ప గెలవలేం అనిపించింది. అవసరమైతే బ్యాటింగ్ లో ఓ చేయి వేయాలనుకున్నాను. అయితే కోహ్లీ తన బ్యాటింగ్ తో మొత్తం సీన్ మార్చేశాడు. 45 బంతుల తర్వాత అతడి బ్యాటింగ్ చూస్తే ‘చంద్రముఖి’ సినిమా గుర్తొచ్చింది. గంగ నుంచి చంద్రముఖిగా కోహ్లీ మారిపోయినట్లు అనిపించింది.’ అని అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక చివరి ఓవర్ లో తను బ్యాటింగ్ కి దిగేలా చేసినందుకు దినేశ్ కార్తిక్ ని తిట్టుకున్నానని అశ్విన్ అన్నాడు. ‘పిచ్ పై ఒక్కో నిమిషం ఒక్కో గంటలా అనిపించింది. ఇక కోహ్లీ.. చివరి బంతుల్లో ఇలా ఆడాలి, అలా ఆడాలని చెబుతున్నాడు. నా బుర్రకు ఏం ఎక్కట్లేదు. ఇక నవాజ్ బౌలింగ్ గురించి అడిగి.. ఖాళీగా ఉన్నవైపు బంతి తోసి సింగిల్ తీయాలనుకున్నాను. కానీ లెగ్ స్టంప్స్ వైపు బాల్ వేస్తున్నాడని గ్రహించాను. పరిస్థితి ఇలా ఉంది, అసలే చలి పెడుతంది. ఇలాంటప్పుడు కవర్స్ మీదగా కొట్టడం ఏంటని, బంతి వైడ్ అవుతుందని తెలిసి వదిలేశాను. చివరి బంతికి సింగిల్ తీశాను. నిజంగా ఓ అద్భుతమైన మ్యాచ్ లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది’ అని అశ్విన్ మ్యాచ్ లో పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు వివరించాడు.