మన దేశంలో క్రికెట్ అంటే ఓ ఎమోషన్. ఆడేవాళ్లు అది ఆట కావొచ్చు. కానీ చూసేవాళ్లకు మాత్రం అలా కాదు. టీమిండియా మ్యాచ్ గెలిస్తే పండగ చేసుకుంటారు. తమ అభిమాన క్రికెటర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడితే తెగ సంతోషపడతారు. ఇక మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లోనూ భారత జట్టుకి.. ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఓ విషయమే తెగ ఆసక్తి కలిగిస్తోంది. ఆసియాకప్ ఈ మధ్య దుబాయిలో జరిగింది. లీగ్ దశలో ఆకట్టుకున్న టీమిండియా గ్రూప్ 4 దశలో తేలిపోయింది. పాక్, శ్రీలంకతో మ్యాచులు ఓడిపోయి.. కప్పు కొట్టలేక ఇంటిముఖం పట్టింది.
ఇక పాక్ తో మ్యాచ్ అంటే ఆటగాళ్లకే కాదు… స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు, టీవీల్లో చూస్తున్న ఆడియెన్స్ కి టెన్షన్ తప్పదు. అందుకు తగ్గట్లే ఆసియాకప్ లో రెండు మ్యాచులు జరిగాయి. కాకపోతే సూపర్ 4 మ్యాచ్ జరిగే టైమ్ లో పాక్ క్రికెటర్ ఆఫ్రిదీ కూతురు, భారత్ జట్టుకి సపోర్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇదే విషయాన్ని ఓ మీడియాతో ఇంటర్వ్యూలో అఫ్రిదీ క్లారిటీ ఇచ్చాడు. లైవ్ లో జర్నలిస్ట్ అడిగిన ఈ ప్రశ్నకు..పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పడం విశేషం.
అవును నా కూతురు భారత జెండా పట్టుకుంది. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని నాతో చెప్పింది. ఆ రోజు(భారత్-పాక్ మ్యాచ్ సమయంలో) స్టేడియంలో 90 శాతం మంది టీమిండియా అభిమానులు, 10 శాతం మంది పాక్ అభిమానులున్నారు. స్టేడియం దగ్గర పాక్ జాతీయ జెండా దొరక్కపోవడంతో భారత జెండా పట్టుకుంది. ఫైనల్లో శ్రీలంక గెలిచిన తర్వాత ఆ దేశ జెండాని గంభీర్ పట్టుకున్నాడు. అంత మాత్రాన అతడు లంకన్ అయిపోడు కదా. అందుకే నా కుమార్తె విషయం గురించి రచ్చ చేయొద్దు’ అని అఫ్రిదీ జర్నలిస్ట్ ని కోరాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అఫ్రిదీ కుమార్తె.. భారత జెండా పట్టుకుని మన జట్టుకు సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆసియా కప్ గెలవడంలో ధోనీదే కీలక పాత్ర! శ్రీలంక కెప్టెన్ చెప్పిన నిజాలు!