పొట్టి ప్రపంచ కప్ మహా సంగ్రామం మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ టీ20 ప్రపంచ కప్ 2022ను సొంతం చేసుకునేందుకు అన్ని జట్లు రెడీగా ఉన్నాయి. ప్రాక్టీస్‌లు, ప్లాన్లతో ఆటగాళ్లు, కోచ్‌లు సిద్దమవుతున్నారు. టీమిండియా కూడా ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి, వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ కూడా ఆసీస్‌లోనే ఉన్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ పక్కనే న్యూజిలాండ్‌లో ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇలా ఆసీస్ పిచ్‌లపై ప్రాక్టీస్ కోసం దాదాపు అన్ని జట్లు వీలైన దారిలో వెళ్తున్నాయి. ఎవరెంత ప్రాక్టీస్ చేసినా.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో కొట్టి.. వరల్డ్ కప్ తెచ్చుకోవడం అంత ఆశామాషీ విషయం కాదు. పుట్టిపెరిగిన పిచ్‌లపై ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగితే.. బ్యాటర్లు పరుగుల వరదపారిస్తారు.
ఇక ఉపఖండపు దేశాల బ్యాటర్లు అక్కడి పేస్, బౌన్స్‌ను తట్టుకుని నిలబడటమే గొప్ప విషయం. ఇలా మిగతా జట్లు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ఆలోచిస్తుంటే.. ఆసీస్ జట్టు మాత్రం ఒక విషయంలో తీవ్ర మదన పడిపోతుంది. ఆ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లే ఈ వరల్డ్ కప్‌కు శాపంగా మారుతారా? స్వదేశంలో కప్ గెలవకపోతే పరువు సంగతి ఏంటంటూ? ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్ సైతం తెగ హైరానపడిపోతున్నారు. అసలు ఆసీస్ ఫ్యాన్స్‌ను ఇంతలా కలవరపెడుతున్న ఆ ప్లేయర్లు ఎవరు? ఎందుకు వారిపై విమర్శలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మిగతా మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా.. వరల్డ్ కప్పులనే సరికీ ఆస్ట్రేలియాలో ఎక్కడ్లేని ఎనర్జీ వచ్చేస్తుంది. పైగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సైతం మంచి జట్టుతోనే వరల్డ్ కప్స్ లాంటి మెగా ఈవెంట్స్‌కు వెళ్తుంది. టీమ్ కప్ గెలుస్తుందా? లేదా? అనే విషయాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేస్తుంది. అంతేకానీ.. స్టార్ ప్లేయర్, సీనియర్ ప్లేయర్ అంటూ ఫామ్ లేకపోయినా నెత్తిన పెట్టుకోదు. ఇదే ఆస్ట్రేలియాలను అనేకసార్లు ప్రపంచ ఛాంపియన్‌ను చేసింది. అరివీర భయంకరమైన బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లు, మెరికల్లాంటి ఫీల్డర్లు, నాణ్యమైన ఆల్‌రౌండర్లతో క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్స్ కోసం జట్టును ఎంపిక చేస్తుంది. కానీ.. ఈ సారి మాత్రం అది మిస్ అయినట్లు కనిపిస్తుంది.
స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎంపిక చేసిన జట్టుపై క్రికెట్ ఆస్ట్రేలియా సొంత అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఫామ్‌లోని కెప్టెన్ ఆరోన్ ఫించ్, మ్యాక్స్‌వెల్, టీ20లకు పనికిరాని స్టీవ్ స్మిత్‌ను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయడమే ఫ్యాన్స్ కోపానికి, ఆందోళనకు కారణం. కేవలం వార్నర్, టిమ్ డేవిడ్, బౌలర్లపై మాత్రమే ఆధార పడి ఆస్ట్రేలియా వరల్డ్ కప్‌కు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కెప్టెన్ అనే కారణంతో ఫించ్, సీనియర్ ప్లేయర్ అనే కారణంతో స్టీవ్ స్మిత్‌ను, టీ20 స్పెషలిస్ట్ అని మ్యాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకున్నారే తప్పా.. వారు ఫామ్‌లో ఉన్నారా? లేరా ? అనే విషయాన్ని ఆస్ట్రేలియా సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఇలాంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ ఆస్ట్రేలియాలో లేదు.
ఆటగాడి ఇమేజ్ కంటే అతని ఫామ్‌కు మాత్రమే విలువు ఇచ్చే ఆస్ట్రేలియా సెలెక్టర్లు ఈ సారి మాత్రం లెక్కతప్పారు. ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న కామెరున్ గ్రీన్ పక్కనపెట్టడంతోనే ఆస్ట్రేలియా సెలెక‌్షన్ ఫెయిల్ అయినట్లు తెలుస్తుందని ఆసీస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీమ్‌తో టీమిండియా, ఇంగ్లండ్ లాంటి పెద్ద జట్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా నిలువగలదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు ఆరోన్ ఫించ్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్ శాపంగా మారబోతున్నారా ? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా పైకి బలంగా కనిపిస్తున్నా.. లోపలంతా లోట్టలానే కపిపిస్తుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Just seven days to go now until the start of the ICC Men’s #T20WorldCup in Australia 💥https://t.co/UCQ792PKRk
— ICC (@ICC) October 9, 2022