రాహుల్ ద్రవిడ్ అలియాస్ ‘ది వాల్’. ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీమిండియా కోసం అతను చేసిన కృషిని వెల కట్టలేం. ముఖ్యంగా టీమిండియా టెస్టు క్రికెట్ లో రాణించడంలో రాహుల్ ద్రవిడ్ ఎంతో కీలక పాత్ర పోషించాడు అనడం అతిశయోక్తి కాదు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు.. మరికొన్నింటిని తిరగ రాశాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించేలా చేశాడు. లక్ష్యం, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. కానీ, ద్రవిడ్ కెరీర్ లో తాను సాధించని ఒక లక్ష్యం కోసం ఇప్పుడు బాటలు వేస్తున్నాడు. ఆటగాడిగా తాను ముద్దాడ లేక పోయిన ప్రపంచకప్ ను.. హెడ్ కోచ్ గా టీమిండియాకు అందిచాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు.
రాహుల్ ద్రవిడ్ తన లక్ష్యం కోసం ప్రణాళికలు గత నాలుగేళ్ల నుంచే రచిస్తున్నాడు. యువతను సిద్ధం చేసి.. వారిని టీమిండియాలోకి తీసుకొచ్చాడు. తను ఏం చెప్పినా చేసే కుర్రాళ్లను జట్టులో ఉంచుకొని కప్పు కొట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాడు. 2023 ప్రపంచ కప్పు మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆతిథ్య జట్టుగా భారత్ కు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా ఉంది ద్రవిడ్ పనితీరు.
దాదా.. సౌరవ్ గంగూలీ- రాహుల్ ద్రవిడ్ మధ్య అనుబంధం గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏరి కోరి రాహుల్ ద్రవిడ్ ను గంగూలీ టీమిండియా హెడ్ కోచ్ గా తెచ్చుకోవడం చూస్తేనే అర్థమవుతుంది. టీమిండియాలో రాహుల్ ద్రవిడ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఎవరిని ఆడించాలి.. ఎలా ఆడించాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఇలా ద్రవిడ్ కు అడ్డు లేదనే చెప్పాలి. ద్రవిడ్ మీద ఉన్న పూర్తి విశ్వాసంతోనే జట్టు విషయంలో ద్రవిడ్ కు గంగూలీ స్వేఛ్చ ఇచ్చాడని అందరికీ తెలిసిన విషయమే.
ఆటగాళ్లుగా ఉన్నప్పుడు గంగూలీ- ద్రవిడ్ సాధించలేకపోయిన లక్ష్యాన్ని.. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈసారి టీమిండియాకు కలిసొచ్చే అంశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? రాహుల్ ద్రవిడ్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన కల నెరవేరాలని కోరుకుందాం.