తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఉల్లంఘించాడని పేర్కొంటూ ప్రముఖ క్రీడా చానల్ పీటీఈ(పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్) రూ. 10 కోట్ల దావా వేసింది. టీ20 వరల్డ్ కప్ కోసం అక్తర్‌తో పనిచేసుందుకు మూడు నెలల అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు, కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మధ్యలోనే అక్తర్ వెళ్లిపోయినట్లు చానెల్ వెల్లడించింది. దీంతో తమ చానల్‌కు నష్టంతోపాటు, పరువుకు భంగం కూడా కలిగిందని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో దుబాయి విడిచిపెట్టి వెళ్లిపోయినందుకు అక్తర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనికిగాను అతను తమకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.
‘మూడు నెలల రాత పూర్వక నోటీసు లేదా అందుకు సమానవైన డబ్బులు చెల్లించి ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరు పక్షాలకు ఉంటుంది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఒక ఇండియన్ టీవీ షోలో పాల్గొనడం వల్ల మాకు తీరని నష్టం కలిగింది. అందువల్ల అక్తర్ మా చానెల్ మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 పాటు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాల్సిందే. లేకపోతే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పీటీఈ ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. అసలు అక్తర్ అలా వెళ్లిపోవడానికి ఒక కారణం ఉంది. పీటీఈ ఇటీవల నిర్వహించిన ఓ లైవ్‌షోలో హోస్ట్ నౌమన్ నియాజ్ అక్తర్‌ను బయటకు వెళ్లిపోవాలని అవమానపరిచాడు. ఆ క్షణమే తన మైక్రోఫోన్‌ను విసిరేసి అక్తర్ బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత చానెల్‌కు కూడా రాజీనామా చేశాడు.