క్రికెట్ ప్రపంచంలో.. వంద టెస్టులు ఆడటం అంటే మాటల్లో చెప్పినంత సులభం కాదు. నిలకడగా రాణిస్తుంటేనే అది సాధ్యం. ఇప్పటివరకు వందల మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడినా.. కేవలం 70 మంది(ఇండియన్ క్రికెటర్లు 11 మంది) క్రికెటర్లు మాత్రమే వంద టెస్టుల మైలురాయిని దాటారంటేనే అర్థం చేసుకోవచ్చు. టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లి అలాంటి అరుదైన రికార్డు ముంగిట ఉన్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన కోహ్లీ.. మార్చి 6న మొహాలీ వేదికగా శ్రీలంక తో జరగబోయే మొదటి టెస్టు మ్యాచుతో 100 టెస్టుల రికార్డును చేరుకోనున్నాడు.
వంద టెస్టులు ఆడటం మంటే గొప్ప అనే ఈ రోజుల్లో.. ఆడిన వందో టెస్టులో కూడా ‘100’ ఘనతను సాధించిన క్రికెటర్లు 9 మంది ఉన్నారు. టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సైతం ఆ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన విరాట్.. 27 సెంచరీలు సాధించాడు. శుక్రవారం నుంచి మొహాలి వేదికగా శ్రీలంకతో జరగబోయే మొదటి టెస్టు టెస్టు విరాట్ కు వందోది. అందులో శతకం సాధిస్తే అరుదైన వందలో ‘100’ పరుగుల జాబితాలో చేరనున్న తొలి భారత క్రికెటర్ గా నిలువనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వందో టెస్టులో వంద పరుగులు సాధించిన క్రీడాకారులు ఎవరో ఓ సారి తెలుసుకుందాం.
కొలిన్ కౌడ్రే (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కొలిన్ కౌడ్రే ఈ రికార్డు నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. బర్మింగమ్ వేదికగా 1968లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 104 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. వంద టెస్టులు ఆడిన తొలి ఆటగాడు కూడా ఇతడే కావడం విశేషం.
జావెద్ మియాందాద్ (పాకిస్థాన్)పాకిస్థాన్ బ్యాటింగ్ దిగ్గజం జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 1989లో లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో మియాందాద్ టీమిండియాపై 145 పరుగులు సాధించి ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే, జావెద్ తన అరంగేట్రం టెస్టులోనూ శతకం సాధించడం మరో విశేషం. ఇలా తొలి టెస్టులో, వందో టెస్టులో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్)వెస్టిండీస్ ఆటగాడు గార్డన్ గ్రీనిడ్జ్ సైతం అరంగేట్రంతో పాటు వందో టెస్టులోనూ శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు. సెయింట్ జాన్స్ వేదికగా 1990లో ఇంగ్లాండ్ పై 149 పరుగులు సాధించి గ్రీనిడ్జ్ ఈ రికార్డు నమోదు చేశాడు. అలాగే గ్రీనిడ్జ్ తన వందో వన్డేలోనూ శతకం బాదాడు. ఇలా టెస్టుల్లో, వన్డేల్లో వందో మ్యాచులో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
అలెస్ స్టీవార్ట్ (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ అలెస్ స్టీవార్ట్ 2000లో మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్ పై 105 పరుగులు సాధించి.. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్)పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ 2005లో టీమిండియాపై ఈ రికార్డు నెలకొల్పాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఇంజమామ్ 184 పరుగులు సాధించాడు. దీంతో ఈ రికార్డు నెలకొల్పిన ఐదో ఆటగాడిగా చరిత్ర కెక్కాడు. జావెద్ మియాందాద్ తరువాత టీమిండియాపై ఇదే రికార్డు నెలకొల్పిన రెండో ఆటగాడు పాకిస్తాన్ క్రికెటర్ కావడం విశేషం.
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా )ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ జాబితాలో ఆరో క్రికెటర్ గా నిలిచాడు. సిడ్నీ వేదికగా 2006లో దక్షిణాఫ్రికాపై తన వందో టెస్టులో (120, 143 *) రెండు ఇన్నింగ్స్ లోనూ శతకం సాధించాడు. దీంతో ఇలా వందో టెస్టులో రెండు శతకాలు బాదిక ఏకైక క్రికెటర్ గా రికీ పాంటింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా)దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ పై ఈ ఘనత సాధించాడు. 2012లో జరిగిన ఈ మ్యాచులో స్మిత్ 131 పరుగులు చేసి వందో టెస్టులో శతకం బాదిన ఏడో క్రికెటర్ గా నిలిచాడు. ఈ మ్యాచులో హషీమ్ ఆమ్లా ట్రిపుల్ సెంచరీతో(311) రాణించాడు.
హషీమ్ ఆమ్లా (సౌతాఫ్రికా)సౌతాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఈ జాబితాలో చేరిన ఎనిమిదో బ్యాట్స్‌మెన్ నిలిచాడు. జోహెన్నెస్బర్గ్ వేదికగా 2017లో శ్రీలంకతో జరిగిన వందో టెస్టులో ఆమ్లా 134 పరుగులు చేశాడు.
జో రూట్ (ఇంగ్లాండ్)ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్, టెస్టు కెప్టెన్ జో రూట్ గతేడాది చెన్నై వేదికగా టీమ్ ఇండియా పై ఈ ఘనత సాధించాడు. దీంతో వందో టెస్టులో శతకం సాధించిన తొమ్మిదో క్రికెటర్ గా నిలిచాడు. అయితే, రూట్ 218 పరుగులు చేసి.. వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.
విరాట్ రికార్డు సృష్టించగలడా..గత రెండేళ్లుగా సెంచరీ కోసం నిరీక్షిస్తున్న విరాట్.. ఈ అరుదైన ఫీట్ సాధించాలంటే చాలా కష్టపడాలి. ఇటీవలి కాలంలో కోహ్లి అర్ధ సెంచరీలతో రాణిస్తున్న.. వాటిని సెంచరీలుగా మలచడానికి ఇబ్బందులు పడుతున్నాడు. కానీ, కోహ్లి కొన్ని కీలక సందర్భాల్లో అంచనాలకు మించి రాణించడం కొత్తేమి కాదు. ఇప్పుడూ అలాగే.. తన వందో టెస్టులో వంద పరుగులు సాధిస్తే అటు అభిమానులకు, ఇటు కోహ్లికి అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అది నిజమవ్వాలని మనమూ ఆశిద్దాం.