వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియాపై విమర్శల జడి పెరిగింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు బోర్డు తీరుపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ గెలుచుకొని వన్డే వేదికకు వస్తున్న సమయంలో భారత ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణం రాత్రి సమయంలో కాగా.. అనివార్య కారణాలతో ఫ్లయిట్ లేట్ అవడంతో దాదాపు 8 గంటల పాటు టీమిండియా విమానాశ్రయంలో ఎదురు చూడక తప్పలేదు. దీంతో ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభించకపోగా.. ఈ అంశంపై టీమ్ మేనేజ్ మెంట్ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. ఇక ముందు రాత్రి పూట ప్రయాణాలు లేకుండా చూడాలని అందులో పేర్కొంది. దీనికి బోర్డు సానకూలంగా స్పందించగా.. కోర్టు కురిపిస్తున్న ప్లేయర్లకు అదే స్థాయిలో వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా బీసీసీఐ పై ఉందని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. ప్రపంచంలోనే ధనిక బోర్డుగా గుర్తింపు సాధించిన బీసీసీఐ తమ ప్లేయర్ల కోసం చార్టర్డ్ ఫ్లయిట్ కొనాల్సిందని అన్నాడు.
‘సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మంచి బోర్డు అని అంటారు. మంచి బోర్డు కూడా మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది. తీరిక లేని క్రికెట్ తో బిజీగా ఉండే ప్లేయర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లకు బీసీసీఐ వెనుకాడకూడదు. విండీస్ పర్యటనలో ఏం జరిగిందో అందరం చూశాం. ఇక మరి కొన్ని రోజుల్లో స్వదేశంలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురు కానుంది. మెగాటోర్నీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్ ల కోసం దేశంలోని 9 నగరాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఒక రోజ ధర్మశాలలో మ్యాచ్ ఆడి.. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లాలి. అటు నుంచి కోల్ కతా ఇలా తిరుగుతూనే ఉండాలి.. ఈ అంశంపై నన్ను ఒకరు అడిగితే.. ‘‘నేనే బీసీసీఐ అధ్యక్షుడినైతే.. నా టీమ్ కు చార్టర్డ్ ఫ్లయిట్ ఉండేది’’ అని బదులిచ్చా. మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ఆటతీరు కనబర్చాలని ఎలా కోరుకుంటామో.. వాళ్లకు అదే సదుపాయాలు కూడా ఉండాలని ఆశిస్తా’ అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా నేడు కరీబియన్లతో మూడో మ్యాచ్ లో తలపడనున్న టీమిండియా.. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ఆడనుంది. 2011 తర్వాత భారత్ లో తొలిసారి జరుగుతున్న ఈ మెగాటోర్నీలో రోహిత్ సేన సత్తాచాటాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తుంటే.. మాజీ క్రికెటర్లు మాత్రం మన సన్నాహకాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఈ సమయంలో ఈ సిరీస్ అవసరమే లేదని ఒకరంటే.. సీనియర్లను ఎంపిక చేసి సెలెక్టర్లు తప్పు చేశారని మరొకరి అభిప్రాయపడుతున్నారు. విండీస్ తో తొల వన్డేలో చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచి గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. నేడు ట్రినిడాడ్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.