ఐపీఎల్ 2022 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌ల తేదీలు, ఎప్పుడు? ఎక్కడ? జరుగుతాయనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాగా ఈ సారి మొత్తం 10 జట్లు ఐపీఎల్ టైటిల్ బరిలో దిగనున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. గతంలో జరిగే ఫార్మాట్‌కు స్వస్తి పలికిన ఐపీఎల్ నిర్వాహకులు ఈ సారి కొత్త ఫార్మాట్‌ను ముందుకు తెచ్చారు. గతంలో 8 జట్లు మిగతా జట్లతో తలా రెండు మ్యాచ్‌లు ఆడేవి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఫ్లేఆఫ్స్‌కు చేరేవి. కానీ ఈ సారి అలా కాకుండా.. మొత్తం పది జట్లును రెండు గ్రూపులగా విభజించారు.
ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు గెలిచిన కప్పుల ఆధారంగా ర్యాకింగ్ ఇచ్చారు. దీంతో ఐదుసార్లు కప్ గెలిచి ముంబై, నాలుగుసార్లు కప్ గెలిచిన ముంబై, చెన్నై తొలిరెండు స్థానాల్లో నిలిచాయి. అలాగే రెండుసార్లు కప్ గెలిచిన కేకేఆర్ మూడోస్థానం, ఎస్‌ఆర్‌హెచ్‌కు నాలుగు, రాజస్థాన్‌కు ఐదో స్థానం దక్కింది. ఈ రెండు జట్లు ఒక సారి కప్ సాధించాయి. ఒక ఇంతవరకు కప్ గెలవని జట్లు.. ఆర్సీబీకి 6, ఢిల్లీకి 7, పంజాబ్‌కు 8వ ప్లేస్‌దక్కింది. కొత్త జట్లు లక్నోకు 9, గుజరాత్‌కు 10వ స్థానం ఇచ్చారు. ఏ, బీ అని రెండు గ్రూప్‌లు చేసి.. నంబర్1 ఏ గ్రూప్‌లో, నంబర్ 2 బీ గ్రూప్‌లో ఇలా విభజించుకుంటూ పోయారు. దీంతో ఏ గ్రూప్‌లో ముంబై, కేకేఆర్, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్ బీలో చెన్నె, హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్, గుజరాత్ ఉన్నాయి. ఒక గ్రూప్‌లోని జట్టు ఆ గ్రూప్‌లోని మిగతా నాలుగు టీమ్‌లతో తలా రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
అలాగే వేరే గ్రూప్‌లోని అన్ని జట్లతో తలా ఒక మ్యాచ్ ఆడుతుంది. ఇక్కడితో ఒక్కో జట్టు 13 మ్యాచ్‌లను పూర్తి చేసుకుంటుంది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌ను వేరే గ్రూప్‌లో తమ స్థానంలో ఉన్న జట్టుతో అంటే ముంబై, చెన్నైతో, కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్‌తో, రాజస్థాన్ ఆర్సీబీతో, ఢిల్లీ పంజాబ్‌తో, లక్నో గుజరాత్‌తో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. దీంతో అన్ని జట్లు 14 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాయి. ఇక్కడితో లీగ్ దశ ముగిసి.. ఫ్లేఆఫ్స్ ప్రారంభం అవుతుంది. కాగా ఈ ఫార్మాట్‌పై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు వస్తున్నాయి. ఫార్మాట్ చాలా గజిబిజిగా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఈ ఐపీఎల్ ఫార్మాట్ కంటే రాకెట్ సైన్స్ చాలా సులభంగా అర్థం అవుతుందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మరి ఈ ఐపీఎల్ ఫార్మాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.