వెంకటేష్ ప్రసాద్.. ఇండియన్ క్రికెట్ లో ఎప్పటికీ మరచిపోలేని బౌలర్. ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ వేసే.. వెంకటేష్ ప్రసాద్ ఇండియన్ మెక్‌గ్రాత్ గా పేరు దక్కించుకున్నారు. వెంకటేష్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
ప్రపంచ క్రికెట్‌ను శాసించిన సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, జయసూర్య, లారా లాంటి హేమాహేమీలనే ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన బౌలర్ ఎవరంటే.. ఠక్కున వినిపించే పేరు గ్లెన్ మెక్‌గ్రాత్. సాదాసీదా బౌలింగ్ యాక్షన్.. మరీ అంత వేగంగా రాని పేస్.. అయినా కూడా ప్రపంచ మేటి బ్యాటర్లకు మెక్‌గ్రాత్ అంటే ఓ సింహస్వప్నం. కచ్చితమైన లైన్ అండ్ లెంత్ బౌలింగే మెక్‌గ్రాత్ బలం. టెస్టు మ్యాచ్‌ల్లో 20, 30 ఓవర్లు వేసినా.. అదే లైన్ అండ్ లెంత్‌తో బౌలింగ్ చేయగల సామర్థ్యం మెక్‌గ్రాత్ సొంతం. అందుకే ప్రపంచ క్రికెట్‌లో అతనో లెజెండ్. ఇప్పటికీ లైన్ అండ్ లెంత్ విషయం గురించి మాట్లాడాల్సి వస్తే.. మెక్‌గ్రాత్‌ను ప్రస్తావించకుండా ఉండలేం. 15 ఏళ్ల పాటు గొప్ప గొప్ప బ్యాటర్లను భయపెట్టిన మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియాలో పుట్టడం వాళ్లు చేసుకున్న అదృష్టం అయితే.. అలాంటి అదృష్టం మనకూ దక్కినా.. సరిగ్గా గుర్తించని దౌర్భాగ్యం మనది. చరిత్ర సరిగా గుర్తించని ఆ ఇండియన్ మెక్‌గ్రాత్ ‘వెంకటేష్ ప్రసాద్’ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వెంకటేశ్ ప్రసాద్ పూర్తి పేరు బాపు కృష్ణారావు వెంకటేష్ ప్రసాద్. కర్నాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన ప్రసాద్ దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబర్చి.. 1996లో భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అప్పటికే జావగల్ శ్రీనాథ్ ఇండియన్ టీమ్ పేస్ బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. శ్రీనాథ్‌తో పోలిస్తే.. వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ చాలా స్లోగా ఉండేది. భయంకరమైన వేగం ఉండేది కాదు. విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ లేదు. దీంతో అతన్ని పేస్ బౌలర్‌గా పిలిచేందుకు కూడా చాలా మంది ఇష్టపడేవారు కాదు. కేవలం గంటకు 120 కిలో మీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ వేసేవాడు. అప్పుడప్పుడు 130ను అలా టచ్ చేసేవాడు. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తుంటే వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌లో ఊహించినంత పేస్ ఉండకపోయేది. కానీ.. వెంకటేశ్ ప్రసాద్ బలం వేగం కాదు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సత్తా అతని సొంతం. అలాగే ఇప్పుడు నకల్ బాల్ అని కొత్తగా చెప్పుకుంటున్న స్లోవర్ డెలవరీలు అప్పట్లోనే వెంకటేశ్ ప్రసాద్ ఆయుధంగా వాడేవాడు.
కానీ.. మన ఉపఖండపు జీవం లేని స్లో, ఫ్లాట్ పిచ్‌లు ప్రసాద్ బౌలింగ్‌కు అంతగా అనుకూలించేవి కావు. కానీ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పిచ్‌లపై వెంకటేశ్ ప్రసాద్ అంటే బ్యాటర్లకు ఓ సింహస్వప్నం. ఆ పిచ్‌లపై అతన్ని ఎదుర్కొవాలంటే బ్యాటర్లు వణికిపోయేవారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేకపోయినా.. వెంకటేశ్ ప్రసాద్ తన కచ్చితమైన లైన్ అండ్ లెంత్ ఆయుధంతో సత్తా చాటేవాడు. ఎన్ని ఓవర్లు వేసినా.. ఎన్ని బంతులు సంధించినా.. అలుపెరగకుండా అదే కచ్చితమైన లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయడం ఒక్క వెంకటేశ్ ప్రసాద్‌కే సాధ్యం అయ్యేది. పైగా.. అతని బౌలింగ్ యాక్షన్ ఎంతో ప్రత్యేకం. చేతిని పర్ఫెక్ట్‌గా తిప్పి వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ వేస్తుంటే.. ఎంతో చూడముచ్చటగా ఉండేది. బౌలింగ్ యాక్షన్‌తో ఇబ్బందులు పడుతున్న ఇప్పటి తరం బౌలర్లు, వర్తమాన క్రికెటర్లు ఒక్కసారి వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ చూస్తే.. ఒక బౌలర్ ఇంత అందగా, పర్ఫెక్ట్‌గా బౌలింగ్ వేయవచ్చా అనే విషయం అర్థమవుతుంది.
బ్రెట్ లీ, అక్తర్ లాంటి బౌలర్లు చించుకుని వేస్తున్నట్లు అత్యంతవేగంతో బౌలింగ్ వేయకపోయినా.. వెంకటేశ్ ప్రసాద్ తన ప్రత్యేకమైన టాలెంట్‌తోనే ప్రత్యర్థి వెన్నులో వణుకుపుట్టించేవాడు. తన కచ్చితమైన లైన్ అండ్ లెంత్‌తో టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. శ్రీనాథ్‌తో కలిసి భారత పేస్ బౌలింగ్ భారాన్ని తన భుజాలపై మోసిన వెంకటేశ్ ప్రసాద్.. ఎన్నో మ్యాచ్‌ల్లో గొప్ప గొప్ప ప్రదర్శనలు చేసినా.. అంతే ఒదిగి ఉండేవాడు. ఇండియన్ క్రికెట్‌లో వివాదరహిత బౌలర్‌గా ప్రసాద్‌కు పేరుంది. దిగ్గజ బ్యాటర్ల వికెట్లు పడగొట్టినా.. సాదాసీదా సెలబ్రేషన్స్‌తో ప్రసాద్ తన ప్రత్యేకతను చాటుకునేవాడు. ఎవరిని కూడా పల్లెత్తు మాట అనేవాడు కాదు. స్లెడ్జింగ్ అంటే ఏంటో కూడా వెంకటేశ్ ప్రసాద్ తెలియదంటే అతిశయోక్తి కాదు. మ్యాచ్ ఆడామా? తన వంతు బౌలింగ్ బాగా వేశామా? వికెట్ పడితే చిరునవ్వులు చిందిచామా? ఇంతే వెంకటేశ్ తెలిసిందే. తన ఆటను ఏనాడూ తన క్రేజ్‌గా భావించలేదు వెంకటేశ్ ప్రసాద్.
మ్యాచ్ సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కవ్వించినా.. ఎంతో హుందా, శాంతంగా తన బౌలింగ్‌తోనే సమాధానం చెప్పేవాడే కానీ.. గీతదాటి నోటితో మాట అనేవాడు కాదు. అలాంటి మృదుస్వభావం గల ఆటగాడిని కూడా పాకిస్థాన్ బ్యాటర్ అమీర్ సోహైల్ రెచ్చగొట్టాడు. ఆత్మగౌరవం దెబ్బతీస్తూ.. నీ ప్రతిబాల్ బౌండరీకే తరలిస్తానని అహం ప్రదర్శించాడు. అయినా కూడా వెంకటేశ్ ప్రసాద్ తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. 1996 వన్డే వరల్డ్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ ప్లేయర్ అమీర్ సోహైల్ అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మంచి ఊపు మీద ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి అయిందన్న అహంతో.. వెంకటేశ్ ప్రసాద్‌ను టార్గెట్‌గా చేసుకుంటాడు. అతన్ని రెచ్చగొట్టి ఏకగ్రాతను దెబ్బతీయాలనేది సోహైల్ ప్లాన్. కానీ.. ఎంత రెచ్చగొట్టినా.. తన లైన్ అండ్ లెంగ్ తప్పని ప్రసాద్.. సోహైల్ రెచ్చగొట్టిన మరోసటి బంతికే అద్భుతమై డెలవరీతో అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి.. బుద్ధిచెబుతాడు. ఈ సంఘటనతో శాంతంగా ఉండే వారిని గెలికితే ఎలా ఉంటుందో మరోసారి తెలుసొచ్చింది.
ఆ వరల్డ్ కప్ తర్వాత 2001 వరకు ఇండియన్ క్రికెట్ టీమ్‌కు వెంకటేశ్ ప్రసాద్ పేస్ బౌలింగ్‌కు వెన్నుముకలా నిలబడ్డాడు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. నమ్మకం పెట్టుకోగల బౌలర్‌గా మారిపోయాడు. కానీ.. ఆ సమయంలో టీమిండియా ఎక్కువగా ఉపఖండపు పిచ్‌లపైనే ఆడటం వెంకటేశ్ ప్రసాద్‌కు శాపమైపోయింది. మన పిచ్‌లు కూడా ఆస్ట్రేలియాలా ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లుగా ఉండి ఉంటే.. వెంకటేశ్ ప్రసాద్‌ను అడ్డుకోవడం ఎవరీ వల్ల కాకపోయేది. అంత వరకు ఉన్నా.. ఇప్పుడు వినిపిస్తున్న గొప్ప గొప్ప బౌలర్ల పేర్లన్ని వెంకటేశ్ ప్రసాద్ తర్వాతే వినిపించేవి. అంతటి టాలెంట్ ఉన్న బౌలర్ వెంకటేశ్ ప్రసాద్. కానీ.. అతను చేసుకున్న దురదృష్టమల్లా.. ఉపఖండంలో ఎక్కువగా ఆడటం. వెంకటేశ్ ప్రసాద్ ఆస్ట్రేలియాలో పుట్టి ఉంటే.. మెక్‌గ్రాత్‌ను మించిపోయేవాడు.
2001లో శ్రీలంక పర్యటన తర్వాత.. జట్టులో చోటు కోల్పోయిన వెంకటేశ్ ప్రసాద్ మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయలేకపోయాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కోచ్‌గా సెంకడ్ ఇన్నింగ్స్ ఆరంభించి సక్సెస్‌ఫుల్ అయ్యాడు. వెంకటేశ్ ప్రసాద్ తన కెరీర్‌లో 33 టెస్టులు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. అందులో 10 వికెట్ల హల్ ఒకసారి, 5 వికెట్ల హల్ 7 సార్లు సాధించాడు. ఇక 161 వన్డేలు ఆడి 196 వికెట్లు కూల్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 361, లిస్ట్ ఏలో 295 వికెట్లు పడగొట్టిన ఘనత వెంకటేశ్ ప్రసాద్ సొంతం. టీమిండియా క్రికెట్ చరిత్రలో వెంకటేశ్ ప్రసాద్ లాంటి పర్ఫెక్ట్ బౌలింగ్ లైన్ అండ్ లెంత్‌తో వేసే బౌలర్ మరొకరు లేరు.. రారు. అతనో చరిత్ర గుర్తించని లెజెండ్. పాత తరం క్రికెట్ అభిమానులకు అతనో ఇండియన్ మెక్‌గ్రాత్.